ఏపీకి వెళ్లిన నిరంజన్ రెడ్డి.. అడ్డుకున్న పోలీసులు!

కలం, వనపర్తి: పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సందర్శించేందుకు వెళ్తున్న మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి (Singireddy Niranjan Reddy)ని జూపాడుబంగ్లా సమీపంలో ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయనతో పాటు పార్టీ కార్యకర్తలు జాతీయ రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రప్రదేశ్‌ నీటిని తీసుకోవడంపై తమకు అభ్యంతరం లేదని, తెలంగాణ రైతులకు కూడా న్యాయం జరగాలని అన్నారు. ఏపీ పోలీసుల తీరును ఖండించిన ఆయన, తెలంగాణ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలనే ఉద్దేశంతోనే తాము అక్కడికి వెళ్తున్నట్లు నిరంజన్‌రెడ్డి తెలిపారు.

మేం ఒత్తిడి చేశాకే..

నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. కృష్ణా నదిలో పోతిరెడ్డిపాడు ద్వారా గ్రావిటీతో రోజుకు 4, 5 టీఎంసీల నీటిని తీసుకునే అవకాశం ఉంది. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు భారీ విద్యుత్‌ అవసరం. అయినా తెలంగాణ రైతులకు నీరు అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఎల్‌ నినో ప్రభావం రెండు రాష్ట్రాలపైనా ఒకే విధంగా ఉంటుందని, దాని పేరుతో ఆంధ్రప్రదేశ్‌కు నీరు ఇస్తూ తెలంగాణ రైతులకు అన్యాయం చేయడం సరికాదన్నారు. కల్వకుర్తి మోటార్లు సక్రమంగా నడపడం లేదని, తాము ఒత్తిడి తెచ్చిన తర్వాతే నీటి విడుదల చేపట్టారని విమర్శించారు. దీంతో ఇప్పటివరకు 162 కిలోమీటర్ల కాలువలో 102 కిలోమీటర్ల మేర నీరు చేరలేదన్నారు.

పోతిరెడ్డిపాడు నుంచి భారీగా నీటి తరలింపు..

జూరాల నుంచి శ్రీశైలానికి భారీగా వరద వస్తున్నందున శ్రీశైలం ఆధారిత పంటలకు నీటి కొరత ఉండదని నిరంజన్ రెడ్డి అన్నారు. జూరాల ఆయకట్టు, ఎత్తిపోతల పథకాలకు నీటి లభ్యతపై రైతులకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గతంలో శ్రీశైలంలో తక్కువ నీటి నిల్వ ఉన్న సమయంలోనూ రైతులకు సాగునీరు అందించినట్లు గుర్తు చేశారు. పోతిరెడ్డిపాడు నుంచి అధికారికంగా చెబుతున్న దానికంటే ఎక్కువ మొత్తంలో నీటిని తరలిస్తున్నారనే అనుమానం ఉందని ఆరోపించారు. పాలమూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు రైతుల నీటి హక్కుల విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని డిమాండ్‌ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>