కలం, జగిత్యాల: అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ నూతన పెన్షన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Minister Adluri Laxman Kumar) అన్నారు. నూతన రేషన్ కార్డులు, నూతన పెన్షన్ల పంపిణీపై గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌తో కలిసి మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. ఎన్నో రోజులుగా నూతన పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని తెలిపారు. వితంతువులు, ఒంటరి మహిళలు, ఫైలేరియా బాధితులు, డయాలసిస్ రోగులు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, తలసేమియా బాధితులు తదితర అర్హులైన వర్గాలకు నూతన పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరూ ఆగస్టు 31లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, మున్సిపాలిటీల్లో బిల్ కలెక్టర్ల ద్వారా దరఖాస్తులను స్వీకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేసేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని, అర్హులైన ప్రతి లబ్ధిదారునికి నూతన పెన్షన్ అందించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ప్రస్తుతం జిల్లాలో 2,18,002 మంది లబ్ధిదారులకు ప్రతి నెల సుమారు రూ.47 కోట్ల మేర పెన్షన్లు ప్రభుత్వం అందిస్తోందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం అందుతున్న పెన్షన్లకు అదనంగా నూతన పెన్షన్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అర్హులైన వారందరికీ సంతృప్త స్థాయిలో పెన్షన్లు అందించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
గీత కార్మికులు, చేనేత కార్మికులకు 50 సంవత్సరాల వయస్సు నుంచే పెన్షన్ పొందే అవకాశం కల్పిస్తున్నామని, దివ్యాంగులకు 51 శాతం వైకల్యం నిబంధన ప్రకారం పెన్షన్ అందిస్తామని మంత్రి తెలిపారు. నూతన పెన్షన్లతో ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడుతున్నప్పటికీ ప్రజా సంక్షేమమే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అని సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. గ్రామాల్లో పర్యటించిన సమయంలో కొత్త పెన్షన్ల కోసం అనేక మంది ప్రజలు తమకు విజ్ఞప్తులు చేశారని, వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు.
హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు
తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నూతన రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల పథకం, పేద కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదలకు ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రతి లబ్ధిదారునికి రూ.5 లక్షలు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. పేదల సంక్షేమం, సామాజిక భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
పేద విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య
రాష్ట్రంలోని యువతకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సుమారు రూ.200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ధర్మపురి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు శంకుస్థాపన జరిగిందని, ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులు ఒకే చోట నాణ్యమైన విద్యను అభ్యసించేలా సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతి పేద విద్యార్థికి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య అందించాలనే లక్ష్యంతో ఈ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
పెండింగ్ బిల్లుల చెల్లింపులు
గురుకులాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.1,000 కోట్ల బిల్లులను ప్రభుత్వం క్లియర్ చేసిందని మంత్రి తెలిపారు. సంక్షేమ హాస్టళ్లకు సంబంధించిన బిల్లులను ప్రతి నెలా గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
సాగునీటికి కొరత లేకుండా చర్యలు
సాగునీటి అంశంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఇటీవల సమీక్ష నిర్వహించారని మంత్రి తెలిపారు. రైతులకు అవసరమైన మేరకు సాగునీరు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, రాష్ట్రంలో సాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతామని తెలిపారు. ఈ సమావేశంలో వెలుమ కార్పొరేషన్ చైర్పర్సన్ జువ్వాడ నరసింహారావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ దినేష్, అదనపు కలెక్టర్ బి రాజ గౌడ్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

