కలం, వెబ్ డెస్క్: ఒకే రోజు ఎనిమిది జీవోలు నిలిపివేస్తూ హైకోర్ట్ ఇచ్చిన తీర్పు చాలా బాధాకరమని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) అన్నారు. వీటిలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి ప్రాముఖ్యత కలిగిన సంక్షేమ పథకం కూడా ఉందన్నారు. కేసీఆర్ ఎంతో ఆలోచించి, తనకు ఎదురైన అనుభవాలతో 2018లో ఈ చారిత్రాత్మక పథకం తీసుకొచ్చి వేల కోట్లు ఖర్చు చేశారని వివరించారు. పేదింటి కుటుంబాలకు పెళ్లి ఖర్చులు భారమవుతున్న తరుణంలో కేసీఆర్ దీన్ని ప్రవేశ పెట్టారని తెలిపారు. 18 సంవత్సరాల తరువాతనే పెళ్లి చేస్తే ఈ పథకం కింద పారితోషికం వస్తుందని, తద్వారా బాల్య వివాహాలు ఆగిపోతాయనేది కేసీఆర్ ఆలోచన అన్నారు.
ప్రభుత్వం పట్టించుకోనందునే..
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు నిలిపేయాలని విజయ్ గోపాల్ అనే వ్యక్తి జనవరిలో పిటిషన్ వేస్తే.. హై కోర్ట్ కౌంటర్ దాఖలు చేయాలని ఎన్నో సార్లు చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) విమర్శించారు. సీఎం రేవంత్, అడ్వకేట్ జనరల్ నిర్లక్ష్యం వహించడంతోనే ఇప్పుడు పథకాలు నిలిపేయాలని హైకోర్ట్ తీర్పు ఇచ్చిందన్నారు. ఇది పేద కుటుంబాలకు పథకాన్ని దూరం చేసే కుట్ర అని ఆరోపించారు. సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
ఆ మంత్రి ఎవరో..
కాంగ్రెస్ ప్రభుత్వంలో డబ్బులు ఢిల్లీకి పోతున్నాయనుకుంటే, ఇప్పుడు అమెరికా కూడా పోతున్నట్లు తెలుస్తుందని ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ విమర్శించారు. డల్లాస్ ఎయిర్‌పోర్టులో భారీగా డబ్బులు తీసుకెళ్తున్న ఓ తెలంగాణ మంత్రిని ఇమ్మిగ్రేషన్ అధికారులు నిలిపేసినట్లు వార్తలొస్తున్నాయని వివరించారు. దీనిపై వెంటనే విచారణ చేసి నిజాలేంటో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Also Read : తెలంగాణ హేట్ స్పీచ్ కమిటీ రెండో సమావేశం
Follow Us On: X(Twitter)

