కలం, నల్లగొండ : నల్లగొండ జిల్లా మిర్యాలగూడ (Miryalaguda)లో మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడికి పోక్సో ప్రత్యేక న్యాయస్థానం కఠిన శిక్ష ఖరారు చేసింది. నిందితుడైన మహమ్మద్ జాకీర్ బాబాకు మొత్తం 25 ఏళ్ల కారాగార శిక్ష విధిస్తూ నల్లగొండ జిల్లా పోక్సో కోర్టు న్యాయమూర్తి విశ్వనాథ్ కులకర్ణి దిలీప్ రావు సంచలన తీర్పునిచ్చారు. 2020 మే 30న మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
నిందితుడు మహమ్మద్ జాకీర్ బాబా సోషల్ మీడియా ద్వారా మైనర్ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ఆపై బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడటంతో, బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కిడ్నాప్ కేసులో 5 సంవత్సరాల జైలు శిక్ష, పోక్సో చట్టంలోని సెక్షన్ 3, 4 కింద 20 సంవత్సరాల కారాగార శిక్ష విధించారు. బాధిత మైనర్ బాలికకు రూ.5 లక్షల పరిహారాన్ని చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది.
ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్ కుమార్ బలమైన ఆధారాలు, వాదనలను కోర్టుకు సమర్పించారు. కేసు దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి, ఆధారాలను పక్కాగా కోర్టు ముందు ఉంచడంలో అప్పటి ఎస్హెచ్‌ఓ డి. శ్రీనివాస్ రెడ్డి, సిడిఓ బి. అఖిల్, భరోసా సెంటర్ లీగల్ ఆఫీసర్ మామిడి కల్పన కీలక పాత్ర పోషించారని ప్రాసిక్యూషన్ వెల్లడించింది. నేరస్థులకు ఈ తీర్పు ఒక హెచ్చరికలా నిలుస్తుందని, మైనర్లపై అరాచకాలకు పాల్పడితే చట్టం తీవ్రంగా శిక్షిస్తుందని ఈ సందర్భంగా అధికారులు స్పష్టం చేశారు.
Also Read : నల్లగొండ డీఎంహెచ్‌వోలో నయా దందా.. ఒక్కో పోస్టుకు రూ.2 లక్షలు వసూలు
Follow Us On: X(Twitter)

