కలం, వెబ్ డెస్క్: ఏనుగులు పర్యావరణ సమతుల్యతకు వారధిగా నిలుస్తాయని.. దేశ వన్యప్రాణి వారసత్వానికి అవి చిహ్నాలు అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) స్పష్టం చేశారు. విశాఖలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో కేంద్ర అటవీ శాఖ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. మానవ – వన్యప్రాణి సంఘర్షణ లేకుండా జీవించడం అత్యున్నతమైనదని అభిప్రాయపడ్డారు. ఏనుగుల సంరక్షణకు ఏపీ అత్యధిక ప్రాధాన్యమిస్తుందని తెలిపారు. కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలోనూ ఏటా రెండు కుంకీ ఏనుగులకు శిక్షణ ఇచ్చే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో మదపుటేనుగుల గుంపులతో తీవ్రమైన సమస్యలుండేవని అన్నారు.
గుంపులుగా దాడి చేసేవి..
సుమారు 132 నుంచి 142 ఏనుగులు గుంపులుగా ఏజెన్సీ ప్రాంతంలో అలజడి సృష్టించేవని డిప్యూటీ సీఎం తెలిపారు. చిత్తూరు జిల్లా పలమనేరు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఏనుగుల గుంపులుగా వచ్చి పంటలను ధ్వంసం చేయడం, అడ్డొచ్చే వారిపై దాడులు చేసేవని గుర్తు చేశారు. తాను అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖల బాధ్యతలను తీసుకున్న తర్వాత మొదటిగా ప్రజలకు, ఏనుగులతో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడం మీదనే దృష్టి సారించానని స్పష్టం చేశారు. నాలుగు కుంకీ ఏనుగులను కర్ణాటక ప్రభుత్వ సహాయంతో తీసుకొచ్చి మదపుటేనుగుల దాడులకు చెక్ పెట్టమని అన్నారు.
ఏనుగుల సంరక్షణకు కేంద్రం ప్రాధాన్యం..
ప్రధాని మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏనుగుల సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని పవన్ కల్యాణ్ అన్నారు. 2014 నుంచి దేశంలోని ఏనుగుల సంరక్షణ కేంద్రాలు 26 నుంచి 33కు పెరిగాయని వివరించారు. కారిడార్ల రక్షణ, ‘ప్రాజెక్ట్ ఎలిఫెంట్’ బలోపేతం, సాంకేతికత ఆధారిత పర్యవేక్షణకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 150 ఏనుగుల కారిడార్లను గుర్తించడం ద్వారా ఏనుగుల ఆవాసాలకు ఇబ్బంది లేకుండా ఉందని తెలిపారు. ఈ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలను ఏపీ ప్రభుత్వం కూడా అనుసరిస్తోందని చెప్పుకొచ్చారు. ఏపీకి కుంకీ ఏనుగులను అందించడంలో సహకరించిన కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు, ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు ధన్యవాదాలు తెలిపారు.

