కలం, వనపర్తి: చేతిలో రాజదండం లేదు.. వెనుక రాజవంశం లేదు.. అంగబలం, అర్థబలం పెద్దగా లేవు. ఉన్నదల్లా అన్యాయాన్ని ఎదిరించాలన్న తెగువ.. అణగారినవారికి అండగా నిలవాలన్న సంకల్పం. అదే ఓ సామాన్యుడిని సేనానిగా మార్చింది. చిన్న దళాన్ని సైన్యంగా తీర్చిదిద్దింది. కోటలను కొల్లగొట్టే స్థాయికి చేర్చింది. దక్కన్‌ను గుప్పిట్లో పెట్టుకున్న మొఘల్ సామ్రాజ్యానికే సవాల్ విసిరేలా చేసింది. ఆయనే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్.
తెలంగాణ చరిత్రలో పాపన్న పేరు ఒక పోరాట స్ఫూర్తికి ప్రతీకగా నిలిచింది. సామాన్యులపై జరుగుతున్న అణచివేతకు వ్యతిరేకంగా ఆయన సాగించిన పోరాటం, నిర్మించిన కోటలు, మొఘల్ అధికారాన్ని సవాల్ చేసిన తీరు నేటికీ చర్చనీయాంశమే. అయితే.. అలాంటి మహనీయుడి విగ్రహం వనపర్తిలో ఏర్పాటు చేసి సంవత్సరాలు గడిచిన ముసుగులోనే ఉండటం స్థానికంగా చర్చకు దారితీస్తోంది.
కల్లుగీత కార్మికుడి నుంచి సేనానిగా..
పూర్వపు వరంగల్ జిల్లా, ప్రస్తుత జనగామ జిల్లా రఘనాథపల్లి మండలం ఖిలాషాపూర్ గ్రామంలో సర్వాయి పాపన్న (Sarvai Papanna Goud) జన్మించారు. తండ్రి పేరు నాసగోని ధర్మన్నగౌడ్. చుట్టు పక్కల గ్రామస్తులు గౌరవంతో ధర్మన్నదొర అనేవారు. తండ్రి చిన్నతనంలోనే చనిపోయారు. సర్వమ్మ అతడి తల్లి. అందరు అతన్ని పాపన్న గౌడ్ అని పాపన్న దొర అన్ని పిలిచేవారు. పాపన్న ఎల్లమ్మకు పరమ భక్తుడు. అతను శివున్ని కూడా ఆరాధించేవాడు. తల్లి కోరిక మేరకు గౌడ వృత్తిని స్వీకరించాడు. చిన్ననాటి నుంచే కష్టజీవితాన్ని చూశారని చారిత్రక, జానపద కథనాలు చెబుతున్నాయి.
కల్లుగీత కార్మికుడిగా జీవనం సాగించిన ఆయనకు సామాన్యుల కష్టాలు, స్థానిక అధికారుల దౌర్జన్యాలు ప్రత్యక్ష అనుభవమయ్యాయి. ఈ పరిస్థితులే ఆయనలో తిరుగుబాటు భావాన్ని రగిలించాయని చెబుతారు. తొలుత కొద్దిమందితో ప్రారంభమైన ఆయన ఉద్యమం క్రమంగా విస్తరించింది. వివిధ సామాజిక వర్గాలకు చెందినవారు ఆయన వెంట నడిచారు. గెరిల్లా తరహా వ్యూహాలతో ప్రత్యర్థులను ఎదుర్కొంటూ తన బలాన్ని పెంచుకున్నారు. కేవలం ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడం కాకుండా.. స్వతంత్ర పాలన నెలకొల్పాలన్న ఆకాంక్ష పాపన్నలో బలపడింది.
కోటలే పోరాట కేంద్రాలు
సర్వాయిపేటలో తొలి కోట నిర్మించిన పాపన్న.. ఆ తర్వాత తాటికొండ, వేములకొండ, షాపూర్, ఖిలాషాపూర్ తదితర ప్రాంతాల్లో తన ప్రభావాన్ని విస్తరించారు. కోటలు ఆయనకు కేవలం రక్షణ కేంద్రాలు మాత్రమే కాకుండా.. మొఘల్ అధికారానికి విసిరిన సవాళ్లుగా నిలిచాయి. పాపన్న ప్రభావం పెరుగుతుండటంతో మొఘల్ పాలకులు అప్రమత్తమయ్యారు. ఆయన్ను అణచివేయడానికి సేనలను రంగంలోకి దించారు. పలు ప్రాంతాల్లో పోరాటాలు జరిగాయి. సైనిక బలం తక్కువగా ఉన్నప్పటికీ పాపన్న వెనక్కి తగ్గకుండా పోరాడినట్లు చారిత్రక కథనాలు పేర్కొంటున్నాయి.
ఔరంగజేబు మరణంతో మారిన సమీకరణాలు..
1707లో ఔరంగజేబు మరణం తర్వాత మొఘల్ సామ్రాజ్యంలో ఏర్పడిన రాజకీయ అనిశ్చితిని పాపన్న తనకు అనుకూలంగా మలుచుకున్నట్లు చారిత్రక ఆధారాలు పేర్కొంటున్నాయి. ఈ సమయంలో తన ప్రభావాన్ని మరింత విస్తరించినట్లు తెలుస్తోంది. వరంగల్ వైపు కూడా ఆయన దండయాత్ర సాగించినట్లు పలు చారిత్రక కథనాల్లో ప్రస్తావన ఉంది. గోల్కొండ స్వాధీనం పాపన్న చరిత్రలో అత్యంత ప్రచారంలో ఉన్న ఘట్టాల్లో ఒకటి. అయితే పాపన్నకు సంబంధించిన కొన్ని సంఘటనలు చారిత్రక ఆధారాలు, జానపద గాథల్లో భిన్నంగా కనిపిస్తాయి. తేదీలు, యుద్ధాల వివరాల్లోనూ వ్యత్యాసాలు ఉన్నాయి. అయినప్పటికీ మొఘల్ ఆధిపత్యాన్ని ఎదిరించిన తెలంగాణ యోధుడిగా పాపన్న పేరు చరిత్రలో నిలిచిపోయింది.
చరిత్రకు రాజకీయ రంగు ఎందుకు?
ఇంతటి చారిత్రక నేపథ్యం ఉన్న పాపన్న గౌడ్ విగ్రహాన్ని వనపర్తిలో ఏర్పాటు చేశారు. మహనీయుడి చరిత్రను నేటి తరానికి పరిచయం చేయాలన్న ఉద్దేశంతో విగ్రహం ఏర్పాటు చేసినప్పటికీ.. ఆవిష్కరణ మాత్రం జరగకపోవడం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశమైంది. విగ్రహం ఏర్పాటు పూర్తయి సంవత్సరాలు గడిచినా ముసుగు తొలగకపోవడంపై స్థానికులు ప్రశ్నలు సంధిస్తున్నారు. విగ్రహావిష్కరణకు ఏమైనా అధికారిక అనుమతుల సమస్య ఉందా? కార్యక్రమం నిర్వహణపై భిన్నాభిప్రాయాలున్నాయా? ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉందని పలువురు కోరుతున్నారు.
విగ్రహ ఏర్పాటు కోసం గతంలో కొందరు నాయకులు లక్షల్లో చందా వసూళ్ళు చేశారనే ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. విగ్రహ ఏర్పాటు కోసం ఎంత వసూలు చేశారో, చందా రూపంలో సమకూర్చిన లక్షల రూపాయలు లెక్కలు చెప్పడం లేదనీ, అనే వాదన ఒకటైతే అందులో వాస్తవం ఎంత మేరకు ఉందో, ఎవరికి వారే యమునా తీరే అని చందంగా వారు ఉంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ నెల (ఆగస్టు) 18న పాపన్న గౌడ్ జయంతి రోజైనా విగ్రహావిష్కరణకు నోచుకుంటుందో లేదో ఎదురు చూడాల్సిన పరిస్థితి స్థానికంగా నెలకొంది.
ముసుగు తొలగేది ఎప్పుడు?
వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌక్ ప్రాంతంలో చారిత్రక కట్టడమైన ‘వనపర్తి రాజా గారి బంగ్లా’ ఆవరణలో సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహానికి ముసుగు వేసి ఉంచడం.. ఆయన చరిత్రకు ముసుగు వేసినట్టుగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. విగ్రహం చుట్టూ రాజకీయాలు కాకుండా.. చరిత్రకు గౌరవం దక్కేలా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించాలని పలువురు కోరుతున్నారు.
మహనీయుడి విగ్రహం ముందు విభేదాలు కాకుండా ఐక్యత కనిపించాలని.. పాపన్న పోరాట స్ఫూర్తిని నేటి తరానికి అందించేలా కార్యక్రమం నిర్వహించాలని గౌడ సంఘ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ చూపాలని స్థానికులు కోరుతున్నారు. చరిత్రకు గౌరవం ఇవ్వాలంటే.. ముందుగా ముసుగు తొలగాలి. పోరాట యోధుడి విగ్రహం రాజకీయాలకు వేదిక కాకుండా.. ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలవాలి.
మహనీయుడి విగ్రహం ముందు విభేదాలెందుకు?
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఒక సామాజిక వర్గానికే పరిమితమైన వ్యక్తి కాదని.. ఆయన పోరాట స్ఫూర్తి సమాజంలోని అన్ని వర్గాలకు ఆదర్శమని పలువురు పేర్కొంటున్నారు. అలాంటి మహనీయుడి విగ్రహావిష్కరణ విషయంలో సామాజిక, రాజకీయ విభేదాలు చోటుచేసుకోవడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విగ్రహం ఏర్పాటులో ఎవరి పాత్ర ఎంత? ఆవిష్కరణ ఎందుకు ఆలస్యమవుతోంది? సమస్య ఉంటే దాన్ని పరిష్కరించేందుకు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? అన్న ప్రశ్నలకు సంబంధిత వర్గాలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని స్థానికులు అంటున్నారు.

