నిర్మల్ కలెక్టరేట్ ఎదుట బీడీ కార్మికుల ధర్నా.. తెరపైకి కీలక డిమాండ్

కలం, నిర్మల్: నిర్మల్‌ (Nirmal) జిల్లా కేంద్రంలో బీడీ కార్మికులు కదం తొక్కారు. బీడీ కార్మికులకు ఆసరా పెన్షన్ పథకంలో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (TUCI) ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టరేట్ ఎదుట వందలాది మంది కార్మికులతో ధర్నా (Beedi Workers Protest) నిర్వహించారు.

ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ మాట్లాడుతూ.. బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది కార్మికులు ఏళ్లుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వయసు పైబడిన బీడీ కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పెన్షన్ పథకంలో దరఖాస్తు చేసుకునే అవకాశం లేకపోవడం అన్యాయమని అన్నారు. ప్రజాపాలన అంటే బీడీ కార్మికులకు ఆసరా పెన్షన్ దూరం చేయడమేనా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు బీడీ కార్మికులకు నెలకు రూ. 4,016 ఆసరా పెన్షన్ అందేలా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోతే భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా మరింత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్ లో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కట్ట రాజన్న, జిల్లా అధ్యక్షుడు బక్కన్న, జిల్లా ఉపాధ్యక్షుడు రామలక్ష్మణ్, జిల్లా సహాయ కార్యదర్శి గంగన్న, జిల్లా కోశాధికారి గఫూర్, జిల్లా కమిటీ సభ్యులు కె. లక్ష్మీ, ఎస్. లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>