నేటి నుంచే శ్రావణ మాసం.. ఈ రోజులు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి!

కలం, వెబ్ డెస్క్: హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసం (Shravana Masam) అత్యంత పవిత్రమైన ఐదవ నెల. దక్షిణ భారతదేశ సంప్రదాయం ప్రకారం ఈ సంవత్సరంలో అనగా 2026లో శ్రావణ మాసం ఆగస్టు 13వ తేదీ నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 10వ తేదీ వరకు ఉంటుంది. ఈ మాసంలో ముఖ్యంగా లక్ష్మీదేవి, పరమశివుడు, మహావిష్ణువు, పార్వతీదేవీ ఆరాధనలకు ఎంతో ప్రసిద్ధి చెందింది.

సాధారణ రోజులతో పోలిస్తే శ్రావణ మాసంలో శివాలయాలు, వైష్ణవాలయాలు, అమ్మవారి శక్తి పీఠాలు అత్యంత శోభాయమానంగా విలసిల్లుతాయి. అంతే కాకుండా ఇళ్లు కూడా నోములు, వ్రతాలు, పూజలతో అధ్యాత్మిక శోభను సంతరించుకుంటాయి. అయితే శ్రావణ మాసంలో ఏ వారాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది, ఏ వారాల్లో ఏ పూజలు చేయాలి అనే విషయాలను పండితులు వివరించారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

వారాల ప్రాముఖ్యత, పూజా విధానాలు

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. శ్రావణ మాసంలో ప్రతిరోజూ పవిత్రమైనదే. అయినప్పటికీ వారంలోని కొన్ని రోజులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని చెబుతున్నారు పండితులు.

శ్రావణ సోమవారం: శ్రావణమాసంలో వచ్చే సోమవారం పరమ శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున భక్తులు భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి, శివాలయాలలో అభిషేకాలు, బిల్వార్చనలు నిర్వహిస్తారు.

శ్రావణ మంగళవారం: శ్రావణమాసంలోని మంగళవారాలలో కొత్తగా పెళ్లైన స్త్రీలు, సుమంగళిలు తమ సౌభాగ్యం కోసం, ముత్తైదువుతనం కోసం మంగళగౌరీ వ్రతం ఆచరిస్తారు.

శ్రావణ శుక్రవారం: శ్రావణణమాసంలో వచ్చే శుక్రవారం లక్ష్మీదేవి పూజకు శుభప్రదమైనదిగా చెబుతారు పండితులు. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకుంటారు.

శ్రావణ శనివారం: శనివారం శ్రీ మహావిష్ణువు ఆరాధనకు శ్​రేష్ఠమైన రోజుగా భావిస్తారు. ఈ రోజులలో భక్తులు తిరుమల శ్రీవారిని లేదా స్థానిక విష్​ణు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు.

శ్రావణ మాసంలో పాటించవలసిన ముఖ్య నియమాలు

పండితుల అభిప్రాయం ప్రకారం.. శ్రావణ మాసంలో ఉదయం, సాయంత్రం వేళల్లో ఇళ్లలో దీపం పెట్టడం సంప్రదాయంగా భావిస్తారు. ముఖ్యంగా తులసి కోట వద్ద దీపాలు వెళిగించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు.

అంతే కాకుండా ఈ మాసంలో సాత్విక ఆహారం తింటూ మాంసాహారానికి పూర్తిగా దూరంగా ఉండడాన్ని సంప్రదాయంగా భావిస్తారు.

శ్రావణమాసంలో చేసే దానధర్మాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని చెబుతారు. పేదలకు అన్నదానం, వస్త్రాలు దానం చేయడం వల్ల విశేష పుణ్య ఫలాలు లభిస్తాయని పండితులు చెబుతారు.

శ్రావణమాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు, వాటి తేదీలు

నాగపంచమి – ఆగస్టు 17
వరలక్ష్మీ వ్రతం – ఆగస్టు 21
రాఖీ పౌర్ణమి – ఆగస్టు 28
శ్రీకృష్ణ జన్మాష్టమి – సెప్టెంబరు 4వ తేదీ

శ్రావణ మాసంలో ఈ పవిత్రమైన రోజుల్లో భక్తి శ్రద్ధలతో పూజలు ఆచరించడం వలన కుటుంబ సౌఖ్యం, అష్టైశ్వర్యాలు, ఆరోగ్య సిద్ధి, సమస్త దోష నివారణ కలుగుతాయని పండితులు సూచిస్తారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>