కలం, స్పోర్ట్స్: టీమిండియాలో (Team India) గాయాల సమస్య మళ్లీ చర్చకు వచ్చింది. జస్ప్రీత్ బుమ్రా మోకాలి వాపుతో ఇబ్బంది పడుతున్నాడు. సాయి సుదర్శన్ ఎడమ కాలి బొటనవేలు గాయంతో జట్టుకు దూరమయ్యాడు. వాషింగ్టన్ సుందర్ తొడ కండరాల గాయంతో అందుబాటులో లేడు. హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి హ్యామ్‌స్ట్రింగ్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. కీలక ఆటగాళ్లు వరుసగా గాయాల పాలవడంతో బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) పనితీరుపై చర్చ మొదలైంది.
టీమిండియాలో ఇప్పుడు ఎక్కువగా బుమ్రా గాయంపై చర్చ జరుగుతున్నది. ఇంగ్లండ్ పర్యటనలో అతడికి మోకాలి సమస్య వచ్చింది. పూర్తిగా కోలుకోకపోవడంతో శ్రీలంకతో జరగనున్న టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యాడు. మూడు ఫార్మాట్లలోనూ బుమ్రా కీలక ఆటగాడు. దీంతో అతడి ఫిట్‌నెస్‌పై టీమ్ మేనేజ్‌మెంట్ ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. గాయాల నేపథ్యంలో సీవోఈ పనితీరుపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అయితే మాజీ భారత బ్యాటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ దీనిపై స్పందిస్తూ.. ఆటగాళ్లను సీవోఈ ఎంపిక చేయదని స్పష్టం చేశాడు. ఆటగాడి శారీరక పరిస్థితి, గాయం నుంచి కోలుకునే స్థితి గురించి టీమ్ మేనేజ్‌మెంట్‌కు సమాచారం ఇవ్వడం మాత్రమే దాని పని అని వివరించాడు. తుది నిర్ణయం కెప్టెన్, కోచ్, సెలెక్టర్లదేనని చెప్పాడు. సీవోఈ కేవలం ఆటగాడి ఫిట్‌నెస్‌పై సమాచారాన్ని అందిస్తుందని పేర్కొన్నాడు.
అదే ముఖ్యం..
ప్రస్తుతం గాయపడిన ఆటగాళ్లందరీ సమస్యలు ఒకే రకంగా లేవని బద్రీనాథ్ తెలిపాడు. అందుకే అన్ని గాయాలకు ఒకే కారణం ఉందని చెప్పడం కష్టమని పేర్కొన్నాడు. ‘‘సాయి సుదర్శన్ బంతి తగలడంతో గాయపడ్డాడు. బుమ్రా సమస్య దీర్ఘకాలంగా కొనసాగుతున్నది. వాషింగ్టన్ సుందర్‌కు కూడా ఫిట్‌నెస్ సమస్యలు ఉన్నాయి. క్రీడల్లో గాయాలు సహజమే అయినా.. ఆటగాళ్లపై పనిభారం, ఫిట్‌నెస్, ఆరోగ్య పరిస్థితిని నిరంతరం గమనించడం ముఖ్యం” అని తెలిపాడు. ప్రస్తుతం పలువురు కీలక ఆటగాళ్లు గాయాల పాలవడంతో వాళ్ల పునరావాసం, పనిభారంపై మరింత శ్రద్ధ అవసరమనే చర్చ జరుగుతున్నది.
సిరాజ్‌పైనే బౌలింగ్ భారం
శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు భారత్ సిద్ధమైంది. బుమ్రా లేకపోవడంతో పేస్ బాధ్యత మొత్తం మహ్మద్ సిరాజ్‌పై పడింది. గాలే, కొలంబోలో నెమ్మదైన పిచ్‌లు ఎదురైనా.. సిరాజ్ తనదైన ముద్ర వేయాలని చూస్తున్నాడు. శ్రీలంకతో భారత్ రెండు టెస్టులు ఆడనుంది. ఈ సిరీస్‌లో సిరాజ్ కీలక బౌలర్‌గా మారాడు. బుమ్రా అందుబాటులో లేకపోవడంతో సిరాజ్ లీడ్ పేసర్‌గా వ్యవహరించనున్నాడు. ప్రసిద్ధ్ కృష్ణ, గూర్నూర్ బ్రార్‌కు కూడా అతనే మార్గనిర్దేశం చేయాల్సి ఉంటుంది.
సొంత గడ్డపై శ్రీలంక బలమైన జట్టు. ఈ పరిస్థితుల్లో సిరాజ్ ప్రదర్శన భారత్‌కు చాలా కీలకం కానుంది. నెమ్మదైన పిచ్‌లపై సిరాజ్‌కు పెద్దగా సహకారం దక్కకపోవచ్చు. అయినా అతని వేగం కీలకంగా మారనున్నాయి. అవసరమైన సమయంలో వికెట్ తీయడం సిరాజ్ ప్రత్యేకత. ఇన్‌స్వింగర్‌తో బ్యాటర్‌ను ఇబ్బంది పెట్టగలడు. ఫుల్ లెంగ్త్ బంతితోనూ వికెట్ సాధించగలడు.
ట్రాక్ రికార్డు గుడ్
బుమ్రా లేని సమయంలో సిరాజ్ బాధ్యత తీసుకోవడం ఇదేమీ కొత్త కాదు. గతేడాది బర్మింగ్‌హామ్ టెస్టులో పేస్ దళాన్ని లీడ్ చేశాడు. ఆ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసి భారత్‌కు కీలకంగా మారాడు. బుమ్రాతో కలిసి ఆడినప్పుడు సిరాజ్ 29 టెస్టుల్లో 90 వికెట్లు తీశాడు. అయితే ప్రధాన బౌలర్‌గా ఆడిన 17 టెస్టుల్లో 50 వికెట్లు సాధించాడు. అతని సగటు కూడా మెరుగైంది.

