కలం, నిజామాబాద్ బ్యూరో: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కొందరు ఎమ్మెల్యేల పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా మారిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడం ఇందుకు బలం చేకూరుస్తోంది. కోర్టుల్లో అనర్హత పిటిషన్ల భయం, కాంగ్రెస్‌లో పూర్తిస్థాయిలో ఇమడకపోవడం, నియోజకవర్గాల అభివృద్ధికి నిధుల కొరత, స్థానిక కాంగ్రెస్ నేతలతో విభేదాలు.. ఇలా మొత్తంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు (Defected BRS MLAs) ఇబ్బందులు వచ్చినట్టు తెలుస్తోంది.
‘లక్ష్మీపుత్రుడి’కి కష్టాలు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ‘లక్ష్మీపుత్రుడు’గా ప్రశంసలు అందుకున్న పోచారం శ్రీనివాసరెడ్డి.. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత అసంతృప్తి స్వరం వినిపిస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధి పనులకు నిధులు రావడం లేదని, ముఖ్యమంత్రి హామీ ఇచ్చినా మంత్రులు స్పందించడం లేదని ఆయన బహిరంగంగానే విమర్శించారు. ఫోన్లు కూడా ఎత్తడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాను కప్పుకున్నది కాంగ్రెస్ కండువా కాదని, జాతీయ జెండా కండువా అని పోచారం చేసిన తాజా వ్యాఖ్యలు కూడా రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. డబ్బుల కోసం తాను కాంగ్రెస్‌లో చేరలేదని, నియోజకవర్గ అభివృద్ధి కోసమే నిర్ణయం తీసుకున్నానని ఆయన చెప్పడం.. కాంగ్రెస్‌లో తన పరిస్థితిపై అసంతృప్తికి సంకేతమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
దానం దారెటు?
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యవహారశైలి కూడా రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచి ఎంపీగా పోటీ చేయడం నుంచి.. అసెంబ్లీలో బీఆర్ఎస్పై విమర్శలు చేయడం, ఆ తర్వాత కేసీఆర్, కేటీఆర్‌పై సానుకూల వ్యాఖ్యలు చేయడం, మళ్లీ వాటిని సోషల్ మీడియా సృష్టిగా కొట్టిపారేయడం వరకు ఆయన వైఖరిలో మార్పులు కనిపించాయి. దీంతో ఆయన రాజకీయంగా ఏ వైపు ఉంటారనే చర్చ కొనసాగుతోంది.
కాంగ్రెస్‌కు ఫిరాయింపు సెగ
ఫిరాయింపు ఎమ్మెల్యేలను సంఖ్యాబలం కోసం పార్టీలో చేర్చుకున్న కాంగ్రెస్.. వారిని రాజకీయంగా, సాంకేతికంగా కాపాడుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలకు, స్థానిక కాంగ్రెస్ నేతలకు మధ్య సమన్వయం లేకపోవడం కూడా సమస్యగా మారింది. నిధుల విషయంలో అసంతృప్తి, ప్రోటోకాల్ వివాదాలు, అనర్హత పిటిషన్ల భయం కొనసాగితే మరికొందరు ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌పై గళం విప్పే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే కొందరి స్వరం పెరుగుతుండటంతో ఇది కాంగ్రెస్‌కు రాజకీయంగా కొత్త తలనొప్పిగా మారే అవకాశముంది.
బీఆర్ఎస్ లోకి రానివ్వం: బాజిరెడ్డి గోవర్ధన్
బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిని బీఆర్ఎస్ లోకి రానివ్వం అని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టంచేశారు. అధికారం చెలాయించడం కోసం ప్రతి సారీ పోచారం పార్టీలు మారుతున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి పాలన నచ్చి మెచ్చి అని చెప్పిన పోచారం చచ్చుకుంటూ అందులోనే ఉండాలని హితవు పలికారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి మూడు సార్లు టికెట్ ఇచ్చి, గెలిపించి, మంత్రిగా, స్పీకర్ గా అవకాశం కల్పించి, వందట కోట్లలో నిధులు ఇచ్చారని గుర్తు చేశారు. అలాంటి కేసీఆర్ ను పోచారం మోసం చేశారని ధ్వజమెత్తారు. “పోచారం బీఆర్ఎస్ లోకి రారని, వచ్చినా మేము రానివ్వం. నాకున్న సమాచారం ప్రకారం ఆయనను పార్టీలోకి తీసుకునే పరిస్థితి లేదు” అని బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశారు.

