GHMC ఎన్నికల్లో ఏ పార్టీలకి SIR ఎసరు..?

కలం, తెలంగాణ బ్యూరో: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా (SIR) ప్రక్రియ ముగియడంతో పార్టీలన్నీ గతంలో ఉన్న ఓటర్లు ఎంత మంది? ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించింది ఎంత మంది? ఈ నెల 17న విడుదల కానున్న ముసాయిదా ఓటర్ల జాబితాలో ఉండేది ఎంత మంది? తొలగించే ఓటర్ల సంఖ్య ఎంత? అని లెక్కలు వేసుకుంటున్నాయి. తాజా గణాంకాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 73.38 లక్షల మంది ఓటర్ల పేర్లు డిలీట్ అయ్యే అవకాశం ఉండగా.. అందులో 43 లక్షలు గ్రేటర్ హైదరాబాద్, దాని పరిసరాల్లోనివే కావడంతో పార్టీలు టెన్షన్ పడుతున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికలు (GHMC Elections) దగ్గర్లో ఉండటంతో ఆ మేరకు ఓటు బ్యాంక్‌పై ప్రభావం చూపుతాయని ఆందోళన చెందుతున్నాయి.

కాంగ్రెస్ పార్టీ జూమ్ మీటింగ్లు పెట్టినా.. :

అర్హులైన ఒక్కరి పేరు కూడా డిలీట్ కాకుండా వ్యవహరించాలంటూ సర్ ప్రక్రియకు ముందు, సర్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులతో పాటు నియోజకవర్గాల ఇన్‌చార్జిలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కొద్దిమంది ఎమ్మెల్యేలు ఇప్పటివరకు దీనిపై దృష్టి పెట్టలేదంటూ గత నెల లాస్ట్ వీక్‌లో వార్నింగ్ ఇచ్చారు. ఏయే నియోజకవర్గాల్లో ఏ మేరకు జరిగిందో గణాంకాలను వివరించారు. వెంటనే బూత్ లెవల్ ఏజెంట్లను యాక్టివ్ చేయాలంటూ దిశానిర్దేశం చేశారు.

స్వయంగా ముఖ్యమంత్రి తన సొంత కొడంగల్ నియోజకవర్గంలో రివ్యూ చేసినా అక్కడ దాదాపు 34 వేల మంది పేర్లు డిలీట్ అయినట్లు ప్రాథమిక సమాచారం. డ్రాఫ్ట్ లిస్టు తర్వాత క్లారిటీ రానున్నది. మరోవైపు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ సైతం తరచూ జూమ్ కాన్ఫరెన్సులు పెట్టి లీడర్లను అలర్ట్ చేశారు. వీరు పెట్టిన మీటింగులు, ఇచ్చిన వార్నింగ్‌లేవీ పనిచేయలేదని తేటతెల్లమైంది.

కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాల్లో ఎక్కడెన్ని పేర్లు మిస్ అయ్యాయో ఈ నెల 18 తర్వాత రివ్యూ జరగనున్నది. అర్హులైనవారిని గుర్తించి తిరిగి చేర్పించడంపై పీసీసీ యాక్షన్ ప్లాన్ రూపొందించనున్నది.

సెగ్మెంట్లవారీగా బీఆర్ఎస్ రివ్యూలు చేసినా.. :

‘సర్’ కారణంగా భారీ స్థాయిలోనే పేర్లు గల్లంతయ్యే ప్రమాదాన్ని బీఆర్ఎస్ ముందుగానే గుర్తించింది. ‘సర్’ సందర్భంగా ఏమేం సందేహాలు వస్తాయో, ఎలాంటి డాక్యుమెంట్లను బీఎల్వోలకు చూపించి డిలీట్ కాకుండా చూసుకోవాలో ప్రజలకు అర్థం చేయించేలా నియోజకవర్గాల ఇన్‌చార్జిలకు, లోకల్ లీడర్లకు, కార్యకర్తలకు, బూత్ లెవల్ ఏజెంట్లకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.

జీహెచ్ఎంసీ, దాని పరిసరాల్లోని నియోజకవర్గాల్లో కేటీఆర్ ప్రత్యేకంగా రివ్యూ సమావేశాలు పెట్టి.. అవగాహన కల్పించారు. హరీశ్‌రావు సైతం కొన్ని నియోజకవర్గాల్లో పర్యటించి మీటింగులు పెట్టారు. అయినా గ్రేటర్, దాని పరిధిలో 43 లక్షలకు పైగా పేర్లు గల్లంతవుతుండటం ఆ పార్టీకి మింగుడుపడడంలేదు. ఇప్పుడు ఓట్లు మిస్ అయ్యే నియోజకవర్గాల్లో మెజారిటీ స్థానాలు బీఆర్ఎస్ చేతిలోనే ఉండడంతో ఈ డ్యామేజ్‌ను కంట్రోల్ చేసే మెకానిజంపై చర్చ మొదలైంది.

ఓల్డ్ సిటీ ఓట్లపైనే మజ్లిస్ స్పెషల్ ఫోకస్ :

‘సర్’ ప్రక్రియ మొదలుకావడానికి ముందు ‘మ్యాపింగ్ ప్రాసెస్’ సమయంలోనే ఏదో జరగబోతున్నదని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ గ్రహించారు. ఎక్కడెక్కడ ఎక్కువ సంఖ్యలో డిలీట్ అయ్యే అవకాశమున్నదో అంచనా వేసుకొని అక్కడి బూత్ లెవల్ ఏజెంట్లను అప్రమత్తం చేశారు.

మ్యాపింగ్ మ్యాచ్ కాని ఓటర్ల వివరాలను సరైన ఆధారాలను చూపించి నమోదు చేయించడంపై మజ్లిస్ చీఫ్ దృష్టి పెట్టారు. ఇప్పుడు గల్లంతైన పేర్లలో ఓల్డ్ సిటీకి చెందినవి గణనీయంగా ఉన్నట్లు అనుమానాలు తలెత్తాయి. దాదాపు 11.26 లక్షల మంది ఆచూకీ దొరకలేదని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ వెల్లడించడంతో.. ఇందులో ఎక్కువగా ఓల్డ్ సిటీకి సంబంధించినవేననే గుబులు లీడర్లలో మొదలైంది.

చాంద్రాయణగుట్ట, మలక్‌పేట్, యాకుత్‌పుర, కార్వాన్ లాంటి నాలుగు నియోజకవర్గాల్లోనే దాదాపు ఆరు లక్షల ఓట్లు గల్లంతయ్యే అవకాశం కనిపిస్తున్నది. ఇక చార్మినార్, బహదూర్‌పుర, నాంపల్లి లాంటి ప్రాంతాల్లోవి కూడా కలిపితే ఈ సంఖ్య పెరుగుతుంది. దీంతో ఓల్డ్ సిటీలో తగ్గుతున్న ఓటర్ల సంఖ్య మజ్లిస్ పార్టీని ఆందోళనకు గురిచేస్తున్నది.

మొదటి నుంచీ స్పష్టతతో బీజేపీ

ఓల్డ్ సిటీలో ఎక్కువగా బోగస్ ఓటర్లు ఉన్నారని బీజేపీ మొదటి నుంచీ ఆరోపిస్తున్నది. ‘సర్’ తర్వాత ఇలాంటివన్నీ క్లియర్ అవుతాయనే నమ్మకంతో ఉంది. ‘సర్’ ఎన్యూమరేషన్ ముగియడంతో గల్లంతవుతున్న ఓటర్ల సంఖ్య తమకు కలిసి వస్తుందని ఆ పార్టీ భావిస్తున్నది. తాము ముందు చెప్పిందే జరుగుతున్నదని పార్టీ నేతలు కాస్త రిలీఫ్ అవుతున్నారు.

ఇప్పుడు తగ్గిన ఓటర్ల సంఖ్య త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లాభిస్తుందని బీజేపీ అంచనా వేసుకుంటున్నది. ఎలాగూ రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై దృష్టి పెట్టినందున జాతీయ నాయకులు ప్రతీ నెలా ఒకరు వస్తారని హైకమాండ్ నుంచి సంకేతాలు రావడంతో ముసాయిదా ఓటర్ లిస్టు తర్వాత ఏయే నియోజకవర్గంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారో దానికి అనుగుణంగా వ్యూహ రచనపై బీజేపీ ఫోకస్ పెట్టనున్నది. ఓటర్ల సంఖ్య తగ్గడంపై ఇతర పార్టీల్లో ఆందోళన ఉన్నా బీజేపీలో మాత్రం ఆహ్వానించదగిన పరిణామమనే నమ్మకం కనిపిస్తున్నది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>