నేడు ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణానికి భూమిపూజ

కలం, వెబ్ డెస్క్: ఎన్నో ఏళ్లుగా పేదలు తమ సొంతింటికోసం ఎదురుచూస్తున్న ఆశలు ఫలించనున్నాయి. కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ (CURE) పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్ల (Indiramma Towers) నిర్మాణానికి గురువారం భూమి పూజ జరుగనుంది. తొలుత హైదరాబాద్ లోని కేపీహెచ్‌బీ కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల టవర్లకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. తొలివిడతలో భాగంగా 16 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్లను నిర్మించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులకు ఈనెల 15 వరకు గడువు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.

మొత్తం 90 ఎకరాల్లో ఈ టవర్ల నిర్మాణం కోసం రూ.807.40 కోట్ల నిధులకు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. 16 టవర్లలో 8 వేల ఇళ్లను నిర్మించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు బుధవారం ఇందిరమ్మ టవర్స్ నిర్మాణంపై సమీక్ష చేపట్టిన మంత్రి పొంగులేటి.. కీలక విషయాలు వెల్లడించారు. ఏడాదిలో లక్ష ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా ముందుకెళుతున్నట్లు తెలిపారు. తొలి విడతలో నిర్మించే ఇళ్లలో ఏడాదిలో గృహ ప్రవేశాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కూకట్‌పల్లిలో గుర్తించిన 5 ఎకరాల స్థలంలో 4 టవర్లు నిర్మించనున్నామని, ఒక్కో టవర్‌లో 120 ఫ్లాట్లు ఉంటాయని తెలిపారు.

ఒక్కో ఫ్లోర్‌లో 12 ఫ్లాట్స్‌ చొప్పున మొత్తం 480 ఇళ్ల నిర్మాణం జరుగుతుందని చెప్పారు. వీటికి రూ.43.20 కోట్లు ఖర్చవుతుందని వివరించారు. క్యూర్ పరిధిలోని ఇందిరమ్మ టవర్స్ నిర్మాణాల పూర్తి వచ్చే ఏడాది బోనాల పండుగ సమయానికి పూర్తి చేస్తామని అన్నారు. హైదరాబాద్‌లో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నా.. నగరంలోనే సొంత ఇల్లు కావాలనే పేదల ఆకాంక్షను నెరవేర్చేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ టవర్లను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోందన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>