రామగుండం – మణుగూరు రైల్వే లైన్‌కు కదలిక.. కేంద్ర మంత్రితో ఎంపీ భేటీ

కలం, కరీంనగర్ బ్యూరో : దేశ రాజధాని ఢిల్లీలో నేడు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో కాంగ్రెస్ ఎంపీలు గడ్డం వంశీకృష్ణ (MP Vamsi Krishna), చామల కిరణ్ కుమార్ రెడ్డి, మల్లు రవి, సురేష్ షెడ్కర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టులు, ప్రజలకు అవసరమైన రైల్వే సౌకర్యాలపై పలు కీలక అంశాలను మంత్రితో చర్చించారు.

ప్రత్యేకంగా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తన పార్లమెంట్ నియోజకవర్గానికి అత్యంత కీలకమైన రామగుండం–మణుగూరు రైల్వే లైన్ పురోగతిపై మంత్రి అశ్విని వైష్ణవ్‌తో చర్చించారు. సుమారు రూ. 4,000 కోట్ల అంచనా పెట్టుబడితో ప్రతిపాదించిన ఈ రైల్వే లైన్ ప్రస్తుత పరిస్థితి, పనుల పురోగతి, తదుపరి చర్యలపై ఎంపీ వివరాలు అడిగి తెలుసుకున్నారు.

రామగుండం, పెద్దపల్లి, మంచిర్యాల ప్రాంతాల పారిశ్రామిక, వాణిజ్య, రవాణా అభివృద్ధికి ఈ రైల్వే లైన్ ఎంతో కీలకమని ఎంపీ వంశీకృష్ణ మంత్రికి వివరించారు. ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి, త్వరితగతిన క్షేత్రస్థాయిలో పురోగతి కనిపించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందిస్తూ.. రామగుండం–మణుగూరు రైల్వే లైన్‌కు సంబంధించిన పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయని ఎంపీకి వివరించినట్లు తెలిపారు.

అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఇప్పటికే మంజూరైన ROBలు, FOBల పనులు, నిధుల విడుదల, పనుల అమలులో జరుగుతున్న జాప్యాన్ని కూడా ఎంపీ వంశీకృష్ణ రైల్వే శాఖ దృష్టికి తీసుకెళ్లారు. గత రెండు సంవత్సరాలుగా ఈ అంశాలపై నిరంతరం ఫాలోఅప్ చేస్తున్నప్పటికీ పనుల్లో ఆలస్యం జరుగుతున్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

నిర్మాణ ప్రాంతాల్లో వాటర్ క్లాగింగ్ కారణంగా ప్రజలకు ఇబ్బందులు, ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని ఎంపీ సూచించారు. అలాగే పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల రైల్వే స్టేషన్ల అప్‌గ్రేడేషన్ అంశంపైనా రైల్వే శాఖ అధికారులతో ఎంపీ వంశీకృష్ణ చర్చించారు.

రైల్వే అభివృద్ధి కోసం నిరంతర ఫాలోఅప్

పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో రైల్వే మౌలిక వసతులను మరింత బలోపేతం చేయడం, పెండింగ్ ప్రాజెక్టులను వేగవంతం చేయడం, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా నిరంతరం కేంద్ర రైల్వే శాఖతో సమన్వయం చేస్తూ ఫాలోఅప్ చేస్తున్నామని ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. రామగుండం–మణుగూరు రైల్వే లైన్ నుంచి ROBలు, FOBలు, రైల్వే స్టేషన్ అప్‌గ్రేడేషన్ల వరకు.. పెద్దపల్లి పార్లమెంట్ అభివృద్ధికి సంబంధించిన ప్రతి అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి పనులు వేగంగా జరిగేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>