కలం, నల్లగొండ : ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం కేటాయించిన సబ్ ప్లాన్ నిధులను పక్కాగా వినియోగించాలని, దారి మళ్లిస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య (Bakki Venkataiah) అధికారులను హెచ్చరించారు. బుధవారం నల్గొండ కలెక్టరేట్‌లోని ఉదయాదిత్య భవన్‌లో కమిషన్ సభ్యులు, కలెక్టర్ జె.శ్రీనివాస్‌లతో కలిసి జిల్లాలోని ఎస్సీ, ఎస్టీల భూ సమస్యలు, అట్రాసిటీ కేసులు, ఉద్యోగాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలుపై విస్తృత సమీక్ష నిర్వహించారు.
సమీక్షలో చైర్మన్ వెంకటయ్య మాట్లాడుతూ.. ఉద్యోగాలు, ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలకు తప్పనిసరిగా ఆర్‌ఓఆర్ అమలు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీలపై దాడుల కేసుల్లో విచారణ వేగవంతం చేసి నిందితులకు శిక్షల శాతం పెంచాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ఆదేశించారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అవుట్‌సోర్సింగ్ నియామకాలపై తక్షణమే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించారు. గుడితాండ పునరావాసంలో 130 మందికి పరిహారం, శూన్యపహాడ్ రోడ్డు వివాదం, అంగడిపేట మహిళ ఇంటి వివాదాలను వెంటనే పరిష్కరించాలన్నారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బాధితులకు అందాల్సిన రూ. 1.89 కోట్ల పరిహారాన్ని త్వరలోనే తెప్పిస్తామన్నారు. వచ్చే ఆదివారం ముఖ్యమంత్రితో జరిగే ‘హై పవర్ కమిటీ’ భేటీలో మాట్లాడి నిధులు మంజూరు చేయిస్తామన్నారు. నల్గొండ బైపాస్ వద్ద ఉన్న అంబేద్కర్, జగ్జీవన్ రామ్ విగ్రహాలను తొలగించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో కమిషన్ సభ్యులు కే. లక్ష్మీనారాయణ, అదనపు కలెక్టర్ ప్రేమకరణ్ రెడ్డి, డిఎస్పీలు, ఆర్డీవోలు పాల్గొన్నారు.

