కలం, నిర్మల్: రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని లక్ష్మణచందా మండలం చామన్‌పల్లి ఎక్స్ రోడ్ నుంచి మునిపల్లి గ్రామంలోని గోదావరి వరకు ప్రధాన రహదారిని డబుల్ రోడ్డుగా అభివృద్ధి చేయడంతో పాటు, మునిపల్లి(Munipalli) వద్ద కొత్త బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి కుచాడి శ్రీహరిరావుకు నాయకులు వినతిపత్రం అందజేశారు. గోదావరి పుష్కరాల సందర్భంగా ఈ ప్రాంతానికి భక్తుల రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉందని, దీంతో రహదారి విస్తరణ, అభివృద్ధి అత్యవసరమని వారు పేర్కొన్నారు. చామన్‌పల్లి ఎక్స్ రోడ్ నుంచి మునిపల్లి వరకు రహదారిని డబుల్ రోడ్డుగా మార్చితే పుష్కరాలకు వచ్చే భక్తులతో పాటు స్థానిక ప్రజలకు కూడా రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని తెలిపారు.
ప్రస్తుతం మునిపల్లి వద్ద ఉన్న బ్రిడ్జి పాతదైపోయిందని, పుష్కరాల సమయంలో పెరిగే రద్దీని దృష్టిలో ఉంచుకుని దాని స్థానంలో కొత్త బ్రిడ్జి నిర్మించాలని కోరారు. ఇందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం నుంచి మంజూరు చేయించాలని విజ్ఞప్తి చేశారు. వినతిపత్రాన్ని స్వీకరించిన కుచాడి శ్రీహరిరావు సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణచందా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నరేష్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఈటల శ్రీనివాస్, నల్లాల లింగారెడ్డి, గంగారెడ్డి, లింగన్న లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

