కలం, దమ్మపేట: యూట్యూబ్, సోషల్ మీడియా ముసుగులో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న కేటుగాళ్లను బుధవారం దమ్మపేట (Dammapeta) పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రముఖ ఛానెల్ జిల్లా బ్యూరో ప్రతినిధులమంటూ డయాగ్నస్టిక్ ల్యాబ్ యజమానిని బెదిరించి, వసూళ్లకు పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలోని డయాగ్నస్టిక్ ల్యాబ్ వద్దకు ముగ్గురు వ్యక్తులు కారులో వచ్చారు.
తాము ఒక ప్రముఖ టీవీ ఛానెల్‌కు చెందిన జిల్లా బ్యూరో సభ్యులమని ల్యాబ్ యజమానికి పరిచయం చేసుకున్నారు. ల్యాబ్‌లో ఎలాంటి అనుమతులు లేకుండానే డెంగ్యూ, టైఫాయిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారంటూ ఆరోపణలకు దిగారు. తన వద్ద నిబంధనల ప్రకారం అన్ని అనుమతులూ ఉన్నాయని యజమాని స్పష్టం చేశాడు. అయినా వినకుండా సోషల్ మీడియాలో వ్యతిరేక వార్తలు, ఫొటోలు పోస్ట్ చేసి ల్యాబ్ ప్రతిష్ట దెబ్బతీస్తామని బెదిరించారు.
అక్కడి నుంచి వెళ్లిపోయిన నిందితులు, ఆ తర్వాత ఫోన్ చేసి రూ. 15వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితుడు మొదటగా రూ. 5 వేలను ఫోన్‌పే ద్వారా బదిలీ చేశాడు. మరో రూ. 5,000 పంపాలని మళ్లీ ఫోన్ చేసి బెదిరించడంతో ల్యాబ్ యజమాని దమ్మపేట పోలీసులను ఆశ్రయించాడు. బెదిరింపులకు పాల్పడిన నిందితులు సునీత అజ్మీరా, విజయ్, కూరం బాబురావులను గుర్తించి అరెస్ట్ చేశారు.

