వేటగాళ్ల క్రూరత్వానికి ఫారెస్ట్ ఆఫీసర్ బలి!

​కలం, బూర్గంపాడు: వన్యప్రాణుల వేటకోసం అమర్చిన విద్యుత్ తీగలు ఓ ఫారెస్ట్ అధికారి ప్రాణాలను బలిగొన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీపురం గ్రామానికి చెందిన వేటగాళ్ల క్రూరత్వానికి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నవీన్(40) బలయ్యాడు. విధి నిర్వహణలోనే దారుణంగా మృతి చెందడం బూర్గంపాడు మండలంలో విషాదం రేపింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన పోలీసులు నిందితులపై ఉక్కుపాదం మోపుతూ బుధవారం కేసు నమోదు చేశారు.

​బూర్గంపాడు మండలం నకిరిపేట గ్రామ అటవీ ప్రాంతంలో వేటగాళ్లు అడవి జంతువులను వేటాడుతున్నారనే సమాచారం అటవీ శాఖకు అందింది. సమాచారం అందుకున్న డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ కురుసం అనార్కలి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నవీన్ తమ సిబ్బందితో కలిసి మంగళవారం రాత్రి ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. చీకటిలో వేటగాళ్ల కోసం వెతుకుతుండగా, ప్రమాదవశాత్తు వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగ తాకడంతో నవీన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

నవీన్ మృతికి కారణమైన వేటగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఆర్‌ఓ అనార్కలి బుధవారం ఉదయం బూర్గంపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పాల్వంచ ఎస్ఐ సతీష్ ఘటనపై దర్యాప్తు వేగవంతం చేశారు. నవీన్ చావుకి కారకులైన లక్ష్మీపురం గ్రామానికి చెందిన వేటగాళ్లు ఆవుల నాగిరెడ్డి, దాసరి నరేశ్, తాటి వీరబాబులపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న అధికారి నవీన్ ఆకస్మిక మరణంతో ఆయన కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>