కలం, నిర్మల్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగదని, మంత్రుల ట్రాప్‌లో పడి తమ రాజకీయ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే (Nirmal MLA) ఏలేటి మహేశ్వర్‌రెడ్డి (MLA Alleti Maheshwar Reddy) అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలన కమీషన్ల దందాగా మారిపోయిందని మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. 40 ఏళ్ల పాటు రాష్ట్రానికి సేవలందించిన రిటైర్డ్ ఉద్యోగులకు ప్రయోజనాలు కల్పించేందుకు కూడా 10 శాతం కమీషన్ అడుగుతున్నారని ఆరోపించారు. డిప్యూటీ సీఎం సతీమణి 10 శాతం ఇస్తేనే పని అవుతుందని చెప్పినట్లు వచ్చిన ఆరోపణలు ప్రభుత్వ అవినీతి తీరుకు నిదర్శనమని పేర్కొన్నారు.
కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించేందుకు 30 శాతం కమీషన్ డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. సెక్రటేరియట్‌లో డిప్యూటీ సీఎం ఛాంబర్ ఎదుటే కాంట్రాక్టర్లు ధర్నా చేసే పరిస్థితి రావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. కోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా అధికారులు మంత్రుల కనుసన్నల్లో పనిచేస్తున్నారని విమర్శించారు. ఉద్యోగుల ఆవేదన, కాంట్రాక్టర్ల కన్నీళ్లతో నడుస్తున్న ఈ అవినీతి ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని మహేశ్వర్‌రెడ్డి హెచ్చరించారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలోకి జారుకుందని, అప్పులు తీర్చలేని పరిస్థితి నెలకొందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.4 లక్షల కోట్ల అప్పు చేసిందని ఆరోపించారు. మూసీ నది ప్రక్షాళన, కొడంగల్, ఫ్యూచర్ సిటీ పేరుతో రేవంత్ ప్రభుత్వం మరింత అప్పులు చేస్తోందని విమర్శించారు. ప్రజలపై ఆర్థిక భారం మోపే విధానాలను ప్రభుత్వం విడనాడాలని మహేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు.

