కలం, కరీంనగర్ బ్యూరో: దేశవ్యాప్తంగా ప్రజలు డిజిటలైజేషన్ ను ఉపయోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పదే పదే చెప్పడం వల్ల ప్రజలంతా డిజిటలైజేషన్ ను ఉపయోగించుకుంటున్నారని, ఈ సమయంలో డిజిటలైజేషన్ తో కేంద్రం ప్రజలపై పన్నుల భారాన్ని మోపుతుందని సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ అన్నారు. ఆ భారాన్ని మోయలేక ప్రజలు రానున్న రోజుల్లో తమ ఓట్ల ద్వారా మోదీ సర్కార్ ను గద్దె దింపుతారని హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించడానికి జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న సీపీఐ ప్రచార జాతా 6వ రోజు కార్యక్రమం మానకొండూర్ (Manakondur) మండలంలో జరిగింది.
మానకొండూర్, ముంజంపల్లి, చెంజర్ల, కొండపల్కల, దేవంపల్లి, ఊటూర్ గ్రామాల్లో జరిగిన కార్యక్రమాలకు సీపీఐ మండల కార్యదర్శి బండ రాజిరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ ప్రచార జాతా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి తూట్లు పొడుస్తూ, కార్పొరేట్, పెట్టుబడిదారులకు ప్రజా ధనాన్ని దోచిపెడుతుందని, విద్యార్థి, యువజన, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరలు,పెట్రోల్,డీజల్, వంట గ్యాస్ ధరలు పెంచి ప్రజలపై పన్నుల భారం వేస్తూ కార్పొరేట్ శక్తులకు రాయితీలు ఇస్తుందని మండిపడ్డారు. సీపీఐ , వామపక్షాలు పోరాడి సాధించుకున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని,పేదలకు ఉపయోగపడే ప్రతీ పథకంపై ఆంక్షలు విధించాలని చూస్తోందని శ్రీనివాస్ ఆరోపించారు.
డిజిటల్ ఇండియా పేరుతో క్యాష్ లెస్ మనీ అని చెప్పిన మోదీ ప్రభుత్వం.. ఇప్పుడు దానితోనే ప్రజలపై పన్నుల భారం వేయడానికి సిద్ధమైందన్నారు. డిజిటల్ పద్ధతిలో 2వేల కంటే ఎక్కువ పేమెంట్లు చేస్తే పన్నులు వేయాలని, 5 వేల కంటే ఎక్కువ చేస్తే 200 రూపాయల పన్ను వసూలు చేయాలని పార్లమెంటులో బిల్లు ఆమోదం చేసుకున్నదని తెలిపారు. పేదలపై పన్నుల భారం వేయడమే డిజిటలైజేషనా? అని ప్రధాని మోదీని ప్రశ్నించారు. ప్రజలు చెల్లించే పన్నులతో ఆయా రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధులల్లో కోత విధిస్తూ, ప్రజా సంక్షేమానికి అర కొర నిధులు ఇస్తున్నాడని, పన్నుల రూపంలో వచ్చే డబ్బులను కార్పొరేట్లకు రాయితీల రూపంలో అందిస్తూ వారి వద్ద మోదీ మోకరిల్లుతున్నాడని పంజాల శ్రీనివాస్ తీవ్రంగా ఆరోపించారు.
దేశంలో బీజేపీ ప్రభుత్వం పాలనపై విసుగు చెందుతున్న వేళ మార్పు కోసం సెప్టెంబర్ ఒకటవ తేదీన సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు ఢిల్లీలో జరిగే ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాని కోసం అధిక సంఖ్యలో సీపీఐ శ్రేణులు ఢిల్లీకి తరలి రావాలని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ జాతా కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, అందె స్వామి, మండల కార్యదర్శి బండ రాజిరెడ్డి, జాతా కో ఆర్డినేటర్స్ కసిరెడ్డి సురేందర్ రెడ్డి, బోయిని అశోక్, గూడెం లక్ష్మీ, నాగెల్లి లక్ష్మారెడ్డి, టేకుమల్ల సమ్మయ్య, జిల్లా కౌన్సిల్ సభ్యులు బీర్ల పద్మ, కొట్టె అంజలి, బామండ్ల పెల్లి యుగేందర్, మండలంలోని శాఖ కార్యదర్శులు ఎరబోయిన సదయ్య, సావన పెళ్లి నాంపల్లి, కిరణ్, శేఖర్, వార్డు సభ్యులు శాతారాజు సంపత్, పంది రాజు, మద్ది కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

