కలం, ఖమ్మం బ్యూరో: సమాజంలో ప్రశ్నించే ప్రతి గొంతులోనూ కమ్యూనిజం భావజాలం దాగి ఉంటుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (MLA Kunamneni) అన్నారు. సీపీఐ చేపట్టిన ప్రజాచైతన్య యాత్రలో భాగంగా మంగళవారం చుంచుపల్లి, సుజాతనగర్ మండలాల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్యే రజబ్ అలీ స్థూపానికి నివాళులర్పించి పార్టీ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన (MLA Kunamneni) మాట్లాడుతూ.. దేశ సంపదను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కొద్దిమంది బడా కార్పొరేట్లకు దోచిపెడుతోందని, వరుస పేపర్ లీకేజీలతో విద్యార్థుల, యువత భవిష్యత్తుతో ఆడుకుంటోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పెరిగిన నిత్యవసరాల ధరలతో సామాన్యుల జీవనం దుర్భరంగా మారిందని, రైతులకు మద్దతు ధర దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
బాధితులంతా ఐక్యమైతే ఏ ప్రభుత్వమైనా దిగిరాక తప్పదని, ప్రజాస్వామ్య రక్షణకు ఎర్రజెండానే సరైన దిక్సూచి అని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో రోడ్లు, వంతెనల నిర్మాణం సహా పలు అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, రానున్న రెండు నెలల్లో కొత్తగూడెం రూపురేఖల్లో స్పష్టమైన మార్పులు చూస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేశ్, ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Also Read : అశ్విన్ లేకపోవడం భారత్‌కు పెద్ద లోటే!: శ్రీలంక మాజీ పేసర్ హెచ్చరిక
Follow Us On: Instagram

