జీఎస్డీపీపై సమీక్ష.. సమగ్ర కార్యాచరణకు సీఎం ఆదేశాలు

కలం, వెబ్ డెస్క్: ఏపీ ఆర్థిక అభివృద్ధిపై నెల వారిగా సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఎప్పటికప్పుడు రివ్యూలు చేస్తున్నారు. తాజాగా మంగళవారం అమరావతిలో జీఎస్డీపీ, 2026 జూలై నెల ఆర్థిక నివేదికపై సంబంధిత అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. 2026 జూలై నెలకు సంబంధించిన ఆర్థిక నివేదికను ప్రణాళికా విభాగం అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వివిధ రంగాల్లో నమోదవుతున్న వృద్ధి, శాఖల పనితీరు, భవిష్యత్‌ ఆర్థిక లక్ష్యాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేలా సమగ్ర కార్యాచరణ రూపొందించాలని సీఎం ఆదేశించారు.

రాష్ట్రంలో 10.7 శాతం వృద్ధిరేటు..

ఎల్‌ నినో వంటి వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో వృద్ధి కొనసాగుతోందని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో రాష్ట్రం సానుకూల వృద్ధిని నమోదు చేస్తోందని చెప్పుకొచ్చారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలోని రెండో త్రైమాసికంలో రాష్ట్రం 10.7 శాతం వృద్ధిరేటును నమోదు చేసినట్లు తెలిపారు. ఈ వృద్ధిరేటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాల పనితీరును ప్రతిబింబిస్తోందని తెలిపారు. ఈ వృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు అవసరమైన చర్యలపై సీఎం చర్చించారు. రాష్ట్రం 15 శాతం వృద్ధిరేటును సాధించేలా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. సామాన్యుడిపై ధరల భారం పెరగకుండా కార్యాచరణ చేపట్టాలని సూచించారు.

మరిన్ని చర్యలు తీసుకోవాలి..

వ్యవసాయ రంగంలో 13.5 శాతం వృద్ధిరేటు, పరిశ్రమల రంగంలో 10.6 శాతం వృద్ధి రేటు, సేవల రంగంలో 9.9 శాతం వృద్ధిరేటు నమోదైనట్లు ఆర్థిక నివేదికలో వెల్లడైంది. ఈ సందర్భంగా ఈ రంగాల వృద్ధి రేటును మరింత పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. సేవల రంగంలో పెట్టుబడులు, ఉపాధి, వ్యాపార కార్యకలాపాలను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వ విధానాలు ఉండాలన్నారు. ప్రతి ప్రభుత్వ శాఖ లక్ష్యాలను చేరుకునేలా వనరులను సమర్థంగా నిర్వహించాలన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>