ఏపీ పల్లెల్లో వెలుగులు.. మరో 158 గ్రామాలకు రోడ్లు

కలం, వెబ్ డెస్క్: ఏపీలోని మారుమూల పల్లెల అభివృద్ధికి శ్రీకారం చుట్టిన కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు వేగవంతం చేసింది. ఇప్పటికే ‘అడవితల్లి బాట’ పేరిట గ్రామాల్లో రోడ్డు సౌకర్యం (Rural Roads) కల్పిస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని ఎన్నో గిరిశిఖర గ్రామాలకు తొలిసారి రోడ్డు వేశారు. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా మైదాన ప్రాంతాల్లో సైతం జనజీవనానికి దూరంగా ఉండే మారుమూల పల్లెలు, ఆవాసాలకు, కుగ్రామాలకు రోడ్లు వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరో 158 మారుమూల గ్రామాలకు అనుసంధాన రహదారులు నిర్మించేందుకు పరిపాలన అనుమతుల ప్రక్రియ పూర్తయినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

పవన్ కీలక ఆదేశాలు..

ఈ సందర్భంగా ఉన్నతాధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కీలక ఆదేశాలు జారీ చేశారు. మారుమూల గ్రామాలకు నిర్మించే రోడ్ల నాణ్యత విషయంలో అత్యున్నత ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం వేసే రోడ్లు పది కాలాల పాటు ప్రజలకు ఉపయోగపడాలని ఆకాంక్షించారు. నూతన రోడ్లు, వంతెనల నిర్మాణంతో ఆయా గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు ఏర్పడి, ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం, మార్కెటింగ్ వంటి సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని ఆకాంక్షించారు.

వారిపై కఠిన చర్యలు..

నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం వహించడం, నాసిరకం రోడ్లు వేసిన కాంట్రాక్టర్ లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రధాని మోడీ నాయకత్వంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సహకారంతో 158 ఆవాసాలకు తొలిసారి రోడ్డు సౌకర్యం కల్పించడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

గ్రామాల్లో 347 కిలోమీటర్లలో..

రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా మరో 158 మారుమూల గ్రామాలకు రహదారులు (Rural Roads) నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గ్రామాల్లో 347 కిలోమీటర్ల పొడవున 146 రోడ్లు, 19 వంతెనల నిర్మాణం జరుగనుంది. రాష్ట్రంలోని ఏఎస్ఆర్, పార్వతీపురం మన్యం, అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, కడప, తిరుపతి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు, పోలవరం, విజయనగరం, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో ఇప్పటికే రోడ్లు లేని ఆవాసాలను గుర్తించి అంచనాలు రూపొందించారు.

రూ. 422.10 కోట్ల నిధులు రిలీజ్..

ఆయా గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి ‘ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన’ పథకం కింద రూ. 422.10 కోట్ల నిధులు రిలీజ్ అయ్యాయి. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంలో ఐదేళ్లపాటు జరుగనున్న ఈ రోడ్ల నిర్వహణకు మరో రూ. 24.47 కోట్లు విడుదలయ్యాయి.

Also Read : సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పై కేసు నమోదు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>