కలం, వెబ్ డెస్క్ : లడఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ దాకా విస్తరించిన ఉత్తర సరిహద్దుల అభివృద్ధి కోసం తెచ్చిన మొదటి విడత పథకం విజయం సాధించడంతో, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రెండో విడతకు పచ్చజెండా ఊపింది. వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్-2 (VVP-2) పేరుతో కొత్త రౌండ్ సరిహద్దు గ్రామాల రూపురేఖలు మార్చడానికి సిద్ధమైంది. దేశంలోని అంతర్జాతీయ భూ సరిహద్దులను ఆనుకుని ఉన్న జిల్లాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, స్థానిక ప్రజల వలసలను నిరోధించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం.
ఈ బృహత్తర కార్యక్రమం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.6,839 కోట్లను కేటాయించింది. ఆర్థిక సంవత్సరం 2028-29 వరకు ఈ నిధులతో సమగ్ర అభివృద్ధి పనులు చేపడతారు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నడిచే కేంద్రీయ రంగానికి చెందిన పథకం. సరిహద్దు ప్రాంతాలలో రహదారులు, విద్యుత్, తాగునీరు, నెట్‌వర్క్ కనెక్టివిటీ, టూరిజం సౌకర్యాలను విస్తృతంగా పెంచనున్నారు.
రెండో విడత కింద దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 1,954 గ్రామాలను ఎంపిక చేశారు. రాజస్థాన్ రాష్ట్రంలో సరిహద్దుల సమీపంలో ఉండే 184 గ్రామాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇందులో కేవలం బార్మర్, జైసల్మేర్ జిల్లాల నుంచే 66 గ్రామాలు చోటు దక్కించుకున్నాయి. లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లిఖితపూర్వక సమాధానంగా ఈ వివరాలను వెల్లడించారు.

