కలం, వెబ్ డెస్క్: ప్రతిపక్ష, అధికార పక్ష పోటాపోటీ నిరసనలతో (Parliament Protest) దేశ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్తత నెలకొంది. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ముగింపు నేపథ్యంలో అధికార ఎన్డీయే, ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు మాటల తూటాలు పేల్చారు. నీట్ పేపర్ లీక్ అంశంపై ఢిల్లీలో చెలరేగిన హింసాకాండ, పోలీసుల చర్యలు, ఇతర అంశాలపై ఇండియా కూటమి నేతలు పార్లమెంట్ లో కేంద్రాన్ని నిలదీస్తూ ఉండగా.. ఎన్డీయే నేతలు కౌంటర్ వేస్తూ వారి వ్యాఖ్యలను ఖండించారు. ఈ క్రమంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీలు పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకున్నాయి.
పార్లమెంట్ ఆవరణలో ఎన్డీయే సభ్యులు.. ఇండియా కూటమికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పారిపోవద్దంటూ బీజేపీ నేతలు ప్లకార్డులు ప్రదర్శించారు. ఇదే సమయంలో ధర్నాకు దిగిన ఇండియా కూటమి నేతలు.. ఇటీవల చోటుచేసుకున్న అంశాలపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు.
చర్చకు సిద్ధం..
పార్లమెంట్ విద్యార్థుల ఆందోళనలకు సంబంధించిన అంశంపై చర్చకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎన్డీయే ఎంపీలు స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని.. కచ్చితంగా ప్రతిపక్ష సభ్యులు సభకు రావాల్సిందేనన్నాను. విపక్షాలు చర్చకు రావాల్సింది పోయి.. పార్లమెంట్ కార్యకలాపాలను అడ్డుకుంటున్నాయని ఎన్డీయే నేతలు ఫైర్ అయ్యారు. ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన సభను స్తంభింపజేయడం సరికాదన్నారు.
సభ వాయిదా..
పార్లమెంట్ సమావేశాలు ముగింపు దశకు చేరుకున్న తరుణంలో ఢిల్లీ ఒక్కసారిగా వేడెక్కింది. మంగళవారం లోక్ సభ ప్రారంభం కాగానే జంతర్ మంతర్ ఫైరింగ్పై కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలంటూ ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. స్పీకర్ ఓంబిర్లా ఇండియా కూటమి సభ్యులకు ఎంత నచ్చజెప్పినా వారు వెనక్కి తగ్గలేదు. దీంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

