కలం, వెబ్ డెస్క్: ఇరాన్ తన హత్యకు పెద్ద ఎత్తున కుట్ర చేస్తోందని గ్రహించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) ఏకంగా తన విమానాన్నే మార్చేశారు. ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలోనే వెళ్తున్నట్లు కెమెరాల ముందు అందరిని నమ్మించిన ట్రంప్.. తరువాత ఎవరికి కనిపించకుండా దిగి, మరో విమానంలో వెళ్లినట్లు ది వాషింగ్టన్ పోస్ట్ సంచలన కథనం ప్రచురించింది. జులైలో జరిగిన ఈ ఘటన గురించి ఆసక్తికర విషయాలు ఇప్పుడిప్పుడే వెల్లడవుతున్నాయి.
అసలేం జరిగిందంటే..
అమెరికా అధ్యక్షుడు జులై 8న తుర్కియే రాజధాని అంకారాలో జరిగిన నాటో సదస్సులో పాల్గొన్నారు. షెడ్యూల్ ప్రకారం బ్రిటన్ వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడ అధికారిక విమానం ఎయిర్‌ఫోర్స్ వన్ ఎగరడానికి సిద్ధంగా ఉంది. ట్రంప్ విమానం ఎక్కుతూ అక్కడ కెమెరాలకు ఫోజు కూడా ఇచ్చారు. ఆ విమానంలోనే పదుల సంఖ్యలో జర్నలిస్టులు కూడా ఉన్నారు. ఇంతలో ఓ క్యాటరింగ్ ట్రక్ విమానం అవతలి వైపు వచ్చి ఆగింది.
దీంతో వెంటనే ట్రంప్.. హైడ్రాలిక్ లిఫ్ట్ ద్వారా ఆహార పదార్థాలు సరఫరా చేసేందుకు వచ్చిన ఆ ట్రక్‌లోకి ఎక్కి.. అక్కడి నుంచి కొంత దూరంలో ఉన్న బోయింగ్ 757 విమానంలో ఎక్కేసి బ్రిటన్ వెళ్లిపోయారు. ఎయిర్‌ఫోర్స్ వన్‌లో ఉన్న సిబ్బంది, జర్నలిస్టులు ట్రంప్ తమతోనే ఉన్నారని భావించారు. ట్రంప్ వెంట రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కొంత మంది కీలక అధికారులు మాత్రమే ఉండటం గమనార్హం.
సీఐఏ సూచనలతోనే..
ట్రంప్ హత్యకు ఇరాన్ ప్లాన్ చేసినట్లు అమెరికా నిఘా సంస్థ సీఐఏ పసిగట్టడంతోనే చివరి నిమిషంలో అత్యంత రహస్యంగా ఈ మార్పులు చేర్పులు చేసినట్లు ది వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. ఇరాన్‌పై అమెరికా దాడి చేసిన మరుసటి రోజే ఈ ఘటన చోటు చేసుకుందని వివరించింది. ఇదొక డెకాయ్ ఆపరేషన్ అని, అమెరికా అధ్యక్షుడు ఇలా విమానం మారిపోవడం ఇటీవల సంవత్సరాల్లో ఇదే మొదటిసారని పేర్కొంది. దీనిపై తరువాత ట్రంప్ స్పందిస్తూ.. ‘ఆ ప్రయాణం ప్రమాదకరమైనదిగా భావించాం’ అని పేర్కొనడం గమనార్హం.

