కలం, మెదక్ బ్యూరో : సంగారెడ్డి జిల్లాలో (Sangareddy BJP) పార్టీని నడిపించే సారథి లేక కకావికాలంగా తయారైంది బీజేపీ పరిస్థితి. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత నియోజకవర్గ నేతలంతా పక్కకు తప్పుకోవడంతో కొన్నాళ్లుగా పార్టీని పట్టించుకునే నాథులే లేరు. కనీసం ఇన్ చార్జ్ లు కూడా లేరు. అధిష్టానం నిర్లక్ష్యం, పార్టీలో అంతర్గత విభేదాలతో కమలం కేడర్ గందరగోళంలో పడిపోయింది. రాజకీయంగా బీజేపీకి కలిసివచ్చే అవకాశాలున్న జిల్లాలో పార్టీ గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతోంది.
అసెంబ్లీ ఎన్నికల తర్వాత జంప్
జిల్లాలో సంగారెడ్డి, పటాన్ చెరు, జహీరాబాద్, అందోల్, నారాయణ ఖేడ్ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి బీఆర్ఎస్ నుంచి వచ్చిన పులిమామిడి రాజుకు, జహీరాబాద్ నుంచి మంత్రి దామోదర రాజనర్సింహ తమ్ముడు రాంచందర్ రాజనర్సింహ, అందోల్ నుంచి సినీ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్, నారాయణ ఖేడ్ నుంచి జర్నలిస్టు సంగప్ప, పటాన్ చెరువు నుంచి మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత బాబుమోహన్, రాజు, రాంచందర్ పార్టీకి రాజీనామా చేశారు. ఇక సంగప్ప, నందీశ్వర్ గౌడ్ పార్టీలో ఉన్నా కానీ, స్థానిక కార్యకర్తలకు అందుబాటులో ఉండటం లేదు. దీంతో ఐదు నియోజకవర్గాల్లో ఏ ఒక్క చోట కూడా బీజేపీ తరఫున బాధ్యత తీసుకనే నేతలు కరువయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ధర్నా, నిరసన చేయాలన్నా పార్టీ కార్యకర్తలను సమన్వయం చేసుకునే నేతలు లేరు. సర్ లో కూడా పార్టీ పరంగా నియోజకవర్గాల్లో ఎలాంటి అవగాహన కార్యక్రమాలను నిర్వహించలేదు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ లు క్షేత్రస్థాయిలో తమ కేడర్ ను సర్ ప్రక్రియలో భాగస్వాములను చేశాయి. కానీ బీజేపీ శ్రేణులు మాత్రం దూరంగా ఉండిపోయాయి.
పట్టించుకున్న నాథుడే లేడు
అసెంబ్లీ ఎన్నికల తర్వాత జిల్లాలో నియోజకవర్గాలకు ఇన్ చార్జ్ లను నియమించలేదు. పార్టీని నమ్ముకుని ఉన్నాం.. కానీ మమ్మల్ని నడిపించే నాథుడే లేడు” అనేది జిల్లాలో పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తున్న ఆవేదన. రెండేళ్లు గడుస్తున్నా నియోజకవర్గ ఇన్చార్జ్ లను నియమించకపోవడం, ఉన్న నేతల మధ్య ఆధిపత్య పోరు పార్టీకి పెద్ద శాపంగా మారింది. సరైన ప్రణాళిక, నాయకత్వం లేకపోవడంతో జిల్లాలో బీజేపీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో పార్టీ పట్టించుకునే నాథుడే లేడని కేడర్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కార్యకర్తలను సమన్వయం చేసేవారు లేకపోవడంతో పార్టీ కార్యక్రమాలను సైతం మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు. కేంద్రంలో పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, జిల్లాలో కేంద్ర పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నారు. మరోవైపు ఉన్న నేతల మధ్య కూడా సమన్వయం లేకపోవడంతో గ్రూపు తగాదాలు నెలకొన్నాయి. దీంతో పార్టీ బతోపేతం కష్టంగా మారింది. ఇప్పటికైనా అధిష్టానం జిల్లాపైన ప్రత్యేక దృష్టి పెట్టి, నియోజకవర్గ ఇన్ చార్జ్ లను నియామకం చేసి, పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు కోరుతున్నారు.
ఆ ఇద్దరున్నా..
- మెదక్ ఎంపీగా రఘునందన్ రావు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఉన్నా కానీ, జిల్లాలో పార్టీకి బాధ్యత కలిగిన నాయకత్వం లేకపోవడంతో నామమాత్రంగా మిగిలిపోతుంది.
- సరైన వ్యూహలు అమలు చేయలేకపోవడంతో పాటు నాయకత్వలేమి పార్టీ అభివృద్ధికి అవరోధంగా మారింది. జిల్లాలో పార్టీ బలపడడానికి అవకాశం ఉన్నాకానీ.. సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తన ఉనికిని కోల్పోయి, సరైన సీట్లను కూడా సాధించలేకపోయింది.
- రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు పార్టీ సవాల్ గా మారనున్నాయి. పటాన్ చెరువు పరిధిలో 9 కార్పొరేటర్ స్థానాలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లోనూ సరైన వ్యూహం, సరైన నాయకత్వ లేమి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.

