కలం, కరీంనగర్ : కరీంనగర్ (Karimnagar) నగరంలో అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేస్తూ, నాణ్యతా ప్రమాణాలను పెంచే దిశగా నగర పాలక సంస్థ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించేందుకు అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా 35వ డివిజన్‌లో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు అత్యాధునిక AJAX సెల్ఫ్ లోడింగ్ కాంక్రీట్ మిక్సర్ యంత్రాన్ని వినియోగిస్తూ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ (Kolagani Srinivas) పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ, అభివృద్ధి పనులు ప్రారంభించడం మాత్రమే కాదు, వాటిని నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అత్యంత ముఖ్యమైన విషయం అన్నారు. అందుకే ఆధునిక యంత్ర సాంకేతికతను వినియోగిస్తూ రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నాం అని తెలిపారు.
వేగం పెరగాలి – నాణ్యత తగ్గకూడదు
రోడ్డు నిర్మాణ పనుల్లో వేగంతో పాటు నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని మేయర్ స్పష్టం చేశారు. కాంక్రీట్ నాణ్యత, సరైన మిశ్రమ నిష్పత్తులు, రోడ్డు మందం, క్యూరింగ్ వంటి అన్ని అంశాల్లో ఇంజినీరింగ్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. నగరంలో (Karimnagar) రోడ్డు పనులు ఎక్కువ కాలం కొనసాగడం వల్ల ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటారని, అందువల్ల ఆధునిక యంత్రాల సహాయంతో సాధ్యమైనంత తక్కువ సమయంలో పనులను పూర్తి చేయడమే లక్ష్యమని మేయర్ పేర్కొన్నారు.
35వ డివిజన్‌తో ప్రారంభం – నగరవ్యాప్తంగా విస్తరణ
35వ డివిజన్‌లో ప్రారంభించిన ఈ విధానాన్ని పరిశీలించి, అవసరాన్ని బట్టి నగరంలోని ఇతర డివిజన్లలో చేపట్టే సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర కాంక్రీట్ నిర్మాణ పనుల్లో కూడా ఆధునిక యంత్ర సాంకేతికతను వినియోగించేందుకు చర్యలు తీసుకుంటామని మేయర్ తెలిపారు. కరీంనగర్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం అని.. ఇందుకు అనుగుణంగా పని విధానాలు కూడా మారాలని చెప్పారు. పాత పద్ధతులకు పరిమితం కాకుండా ఆధునిక యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రజలకు మెరుగైన రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక సదుపాయాలు అందించడమే లక్ష్యం కొలగాని స్పష్టం చేశారు.
అభివృద్ధికి ఆధునిక సాంకేతికత కొత్త వేగం
AJAX వంటి ఆధునిక యంత్రాల వినియోగం ద్వారా మానవ వనరులపై ఆధారపడటాన్ని తగ్గించడం, పనుల అమలులో వేగం పెంచడం, కాంక్రీట్ సరఫరాలో సమయాన్ని ఆదా చేయడం, నిర్మాణ ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించడం సాధ్యమవుతుందని మేయర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో 35వ డివిజన్ కార్పొరేటర్ సాధవిని సుజాత శ్రీనివాస్, మున్సిపల్ అధికారులు, ఇంజినీరింగ్ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Also Read : హర్ ఘర్ తిరంగా అద్భుతమైన కార్యక్రమం : సునీల్ రావు
Follow Us On : WhatsApp

