కృష్ణా తీరంలో వరుణ యాగం.. సీఎం దంపతుల ప్రత్యేక పూజలు

కలం, నాగార్జునసాగర్ : కృష్ణా నది ఒడ్డున శోభాయమానంగా నిర్వహిస్తున్న వరుణ యాగం (Varuna Yagam) లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ వరుణ దేవుడికి ప్రార్థనలు సమర్పించారు. అంతకుముందు నాగార్జునసాగర్‌లోని హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా స్వాగతం పలికారు.

వైభవంగా జరుగుతున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో సీఎం దంపతులతో పాటు పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, స్థానిక నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జయవీర్ రెడ్డితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు యాగంలో పాల్గొని ప్రత్యేక పూజలు సమర్పించారు. కృష్ణా తీరంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ భక్తిశ్రద్ధలతో ఈ యాగం కొనసాగింది. ఈ సందర్భంగా అధికారులు, ఆధ్యాత్మిక వేత్తలు యాగ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ముగిసిన మహా వరుణ యాగం

కృష్ణా తీరంలో అత్యంత వైభవంగా నిర్వహించిన వరుణయాగం (Varuna Yagam) సోమవారం నాటి పూర్ణాహుతితో మహోజ్వలంగా ముగిసింది. వేద పండితులు, రుత్వికుల వేదమంత్రోచ్ఛారణల నడుమ నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని విజయవిహార్ ప్రాంగణంలో ఈ క్రతువును ఆధ్యాత్మిక శోభతో పూర్తి చేశారు. ఈ మహోన్నత పూర్ణాహుతి కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొని, పీఠాధిపతులు, వేద పండితుల మార్గదర్శకత్వంలో ప్రత్యేక హవనంలో హవిస్సులు సమర్పించారు.

రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి, జలాశయాలన్నీ జలకళతో నిండాలని, రైతాంగం పంటలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ యాగం నిర్వహించారు. యాగశాల వద్ద రుత్వికుల మంత్రోచ్ఛారణలతో నాగార్జునసాగర్ పరిసరాలు శోభిల్లిపోయాయి. సామాన్య ప్రజలు, భక్తులు కూడా ఈ పూర్ణాహుతి క్రతువును ప్రత్యక్షంగా వీక్షించేందుకు జిల్లా యంత్రాంగం విజయవిహార్ పరిసరాల్లో భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసింది.

ఈ ముగింపు వేడుకలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారులు కే. కేశవరావు, సుదర్శన్ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డిలతో పాటు పలువురు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొని స్వామివారి ప్రసాదాలు స్వీకరించారు.

Also Read : ఎర్రకోటపై వందేమాతరం గీతం ఆలాపన

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>