కలం, హనుమకొండ: రైతులు, పేదల భూ హక్కులకు శాశ్వత భద్రత కల్పించడంతో పాటు ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Minister Ponguleti) అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ కార్యాలయాల నిర్మాణానికి సుమారు రూ.600 కోట్లు కేటాయించామని, దాదాపు 180 తహశీల్దార్, ఆర్డీవో కార్యాలయాలను నిర్మించనున్నట్లు తెలిపారు. హనుమకొండ (Hanumkonda) జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో సోమవారం మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి రూ.3.25 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న తహశీల్దార్ కార్యాలయ భవనానికి పొంగులేటి శంకుస్థాపన చేశారు.
ప్రతి అంగుళం భూమికి లెక్క
ధరణి స్థానంలో తీసుకొచ్చిన భూభారతి (Bhu Bharati) చట్టం ద్వారా రైతులు, భూ యజమానులకు భూములపై హక్కులు, భద్రత కల్పిస్తున్నామని మంత్రి (Minister Ponguleti) తెలిపారు. భూ రికార్డుల ప్రక్షాళనతో పాటు భూ పరిపాలనలో పారదర్శకత తీసుకొస్తున్నామని చెప్పారు.
రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో తొలి విడతగా 70 రెవెన్యూ గ్రామాలను ఎంపిక చేసి సమగ్ర భూ సర్వే చేపట్టినట్లు వెల్లడించారు. రాబోయే ఏడాదిన్నర నుంచి రెండేళ్లలో రాష్ట్రంలోని ప్రతి రెవెన్యూ గ్రామంలో భూముల సమగ్ర సర్వే పూర్తి చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
ప్రతి భూ పార్సిల్‌కు ప్రత్యేక గుర్తింపు సంఖ్యతో పాటు భౌగోళిక కోఆర్డినేట్స్‌తో కూడిన డిజిటల్ మ్యాప్ రూపొందించనున్నట్లు తెలిపారు. తద్వారా భవిష్యత్తులో భూ వివాదాలు, హద్దుల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.
కార్యాలయాలకూ కొత్త రూపు
గత ప్రభుత్వ హయాంలో జిల్లాలు, డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేసినా వాటికి అవసరమైన కార్యాలయ భవనాలు, మౌలిక వసతులు కల్పించలేదని పొంగులేటి విమర్శించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కొత్త కార్యాలయ భవనాల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు.
ఎల్కతుర్తి అభివృద్ధికి అదనపు నిధులు
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఎల్కతుర్తి మండల ప్రజల చిరకాల కోరిక అయిన తహశీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం సంతోషకరమని అన్నారు. మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ ఆర్టీఓ కార్యాలయ భవనాన్ని పూర్తి చేసేందుకు అదనపు నిధులు మంజూరు చేయాలని పొంగులేటిని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి ఈ వారంలోనే అవసరమైన అదనపు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, అదనపు కలెక్టర్ రవి, ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ సామ్య నాయక్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Also Read : పొంగులేటి Vs కౌశిక్ రెడ్డి.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో వాగ్వాదం
Follow Us On : WhatsApp

