కలం, నర్సంపేట: ఇటీవల మరణించిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి (Peddi Sudarshan Reddy) విగ్రహ ఆవిష్కరణ కోసం నిర్మించిన గద్దెను మున్సిపల్ అధికారులు కూల్చివేయడంతో నర్సంపేటలో రాజకీయ వేడి రాజుకుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఎదురుగా ఉన్న ప్రైవేట్ స్థలంలో ఏర్పాటు చేసిన గద్దెను ఆదివారం రాత్రి అధికారులు కూల్చివేయడం బీఆర్‌ఎస్ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. సోమవారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు (Errabelli Dayakar Rao) ఘటనాస్థలిని సందర్శించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
ఇది దుర్మార్గపు చర్య..
పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ ఆవిష్కరణను అడ్డుకోవడం దుర్మార్గపు చర్య అని ఎర్రబెల్లి దయాకర్‌రావు (Errabelli Dayakar Rao) మండిపడ్డారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా విగ్రహ గద్దెను కూల్చివేయడం ఏమిటని ప్రశ్నించారు. నర్సంపేట పట్టణంలో గతంలో ఏర్పాటు చేసిన విగ్రహాలన్నింటికీ అనుమతులు ఉన్నాయా? అని నిలదీశారు. నిబంధనలు అందరికీ సమానంగా వర్తించాలన్నారు.
కాంగ్రెస్ నేతల కుట్ర..
విగ్రహ ఏర్పాటును అడ్డుకోవడం వెనుక కాంగ్రెస్ నాయకుల కుట్ర ఉందని ఎర్రబెల్లి ఆరోపించారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసి తీరుతామని స్పష్టం చేశారు. గద్దె కూల్చివేతకు బాధ్యులైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పెద్ది మృతిపైనా అనుమానాలా?
గద్దె కూల్చివేత ఘటనపై మాట్లాడిన ఎర్రబెల్లి.. పెద్ది సుదర్శన్‌రెడ్డి మరణంపైనా తమకు అనుమానాలు కలుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఆయనను మానసికంగా ఎంతగా ఇబ్బందులకు గురిచేశారో ఈ పరిణామాలను బట్టి అర్థమవుతోందన్నారు. ఈ వ్యాఖ్యలు నర్సంపేట రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
రెండు రోజుల డెడ్‌లైన్..
పెద్ది సుదర్శన్‌రెడ్డి దశదిన కార్యక్రమం ఉన్నందున ప్రస్తుతం చేపట్టిన ధర్నాను తాత్కాలికంగా విరమించుకుంటున్నట్లు ఎర్రబెల్లి తెలిపారు. అధికారులకు రెండు రోజుల సమయం ఇస్తున్నామని, ఈలోపు గద్దె కూల్చివేతకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రెండు రోజుల్లో స్పందన రాకపోతే ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ గ్రామాన పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు.
Also Read : పెద్ది సంస్మరణ సభలో కేటీఆర్ ప్రకటన
Follow Us On : WhatsApp

