కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రాత్రిపూట మోటార్ సైకిళ్లపై పెట్రోలింగ్ చేసే పోలీసులు సక్రమంగా డ్యూటీ చేస్తున్నారా?.. ఒకే చోట కూర్చుని టైమ్ వేస్ట్ చేస్తున్నారా?.. వారి బీట్ ఏరియా మొత్తాన్ని తిరగకుండా ఒకే చోట ఉండిపోతున్నారా?.. ఇలాంటి అనుమానాలు చాలా కాలంగా ఉన్నాయి. పోలీసులలో జవాబుదారీతనం పెంచడానికి, ప్రజలకు సత్వర సాయాన్ని అందించడానికి రాష్ట్ర పోలీసు డిపార్టుమెంట్ (Telangana Police) కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది.
కేవలం బీట్ పోలీసులు చెప్పే వివరాలు, డైరీలోని అంశాలనే పరిగణనలోకి తీసుకోకుండా వారు వినియోగిస్తున్న బైక్‌లకు జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ పెట్టాలని భావిస్తున్నది. త్వరలో ఆ అవసరాలకు వాడే అఫీషియల్ బైక్‌లకు ఈ విధానం అమల్లోకి రానున్నది. ఈ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా బీట్ పోలీసులు ఏ టైమ్‌లో ఎక్కడున్నారు?.. ఎంతసేపు ఒకే చోట ఉన్నారు?.. వారి పరిధిలోని మొత్తం ప్రాంతాన్ని పెట్రోలింగ్ చేస్తున్నారా?.. ఇలాంటి అంశాలను ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలు కలుగుతుంది. ఈ మొత్తం వ్యవస్థను హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC)తో అనుసంధానించడంతో నిరంతర నిఘా కొనసాగుతుంది.
మొత్తం 1500 బైక్‌లకు జీపీఎస్ ట్రాకింగ్
పోలీసుల పెట్రోలింగ్ వ్యవస్థను టెక్నాలజీ ఆధారంతో ఎఫెక్టివ్‌గా తీర్చదిద్దేందుకు హోం శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో పోలీసులు పెట్రోలింగ్ అవసరాలకు వాడుతున్న సుమారు 1,500 టూ-వీలర్లకు త్వరలో జీపీఎస్ ట్రాకర్లు అటాచ్ కానున్నాయి. ఈ సౌకర్యంతో పెట్రోలింగ్ బైక్ ఎక్కడుందో తెలుసుకోవడం, కదలికలను రియల్ టైమ్‌లో పర్యవేక్షించడం, నిర్దేశించిన బీట్‌లోనే తిరుగుతున్నాయో లేదో కనిపెట్టడం, ఎమర్జెన్సీ పరిస్థితి తలెత్తితే వెంటనే ఆ పెట్రోలింగ్ పోలీసుల్ని అలర్ట్ చేయడం.. ఇలాంటివి ఈ సిస్టమ్‌తో నెరవేరనున్నాయి. విధి నిర్వహణపై పర్యవేక్షణ కూడా పెరుగుతుంది. పలు అవసరాలను ఒకే వ్యవస్థలోకి తీసుకురావడం వీలవుతుంది.
తెలంగాణ పోలీస్ డిపార్టుమెంట్లో జీపీఎస్ ట్రాకింగ్ కొత్త అంశమేమీ కాదు. గతంలో బ్లూ కోల్ట్స్, పాట్రోలింగ్ మొబైల్ వెహికల్స్ లాంటివాటికి ఇది అమలైంది. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో టూ-వీలర్, ఫోర్-వీలర్ పాట్రోల్ వాహనాల లైవ్ ట్రాకింగ్, ఎస్ఓఎస్ (ఎమర్జెన్సీ కాల్స్), స్పీడ్ మానిటరింగ్, ట్రావెల్ ట్రాకింగ్ తదితర వివరాలను పర్యవేక్షించడం అమలవుతూనే ఉంది. కమాండ్ కంట్రోల్ వ్యవస్థతో అనుసంధానమైంది. అత్యవసర సమయాల్లో అలర్ట్ చేసి అక్కడకు పంపించే విధానం కొనసాగుతున్నది. కానీ, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా దీన్ని విస్తరించాలని హోం శాఖ భావిస్తున్నది.
శాటిలైట్ మెకానిజంతో లింక్
పోలీసులు వాడుతున్న టూ-వీలర్లకు ప్రత్యేకంగా లేటెస్ట్ జీపీఎస్ ఎక్విప్మెంట్ అమర్చడం ద్వారా మానిటరింగ్ మెకానిజం మరింత పర్ఫెక్ట్ గా పనిచేయనున్నది. ఈ పరికరాలు మొబైల్ సర్వీసుల్లో వాడే 5-జీ, 4-జీ మొదలు 2-జీ వరకు పనిచేస్తాయి. జీపీఎస్‌తో పాటు ‘గ్లోనాస్’, ‘గెలీలియో’ లాంటి శాటిలైట్ వ్యవస్థలతో కమ్యూనికేషన్కూ పనికొస్తాయి. ఏదేని పరిస్థితుల్లో బ్యాటరీ డౌన్ అయినా, పూర్తిగా ఆగిపోయినా వెంటనే కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు ‘పవర్ డిస్కనెక్షన్’ అలర్ట్ వెళ్తుంది. లేదా ‘ట్యాంపరింగ్’ అనుమానంతో ఉన్నతాధికారులు అప్రమత్తమవుతారు.
పెట్రోలింగ్ పోలీసుల్లో జవాబుదారీతనం పెంచడానికి ఈ కొత్త ఎక్విప్మెంట్తో బీట్ పరిధిలో డ్యూటీ టైమ్‌లో రూట్ హిస్టరీ, ట్రిప్ ప్లేబ్యాక్, స్పీడ్ మానిటరింగ్, ఇగ్నిషన్ ఆన్-ఆఫ్, పార్కింగ్, మోషన్ డిటెక్షన్ వంటివన్నీ కమాండ్ కంట్రోల్ సెంటర్ స్టాఫ్ గుర్తించగలుగుతారు. బైక్ ఎక్కడెక్కడ తిరిగింది, ఎంతసేపు ఆగింది, ఎక్కడ ఆగింది, ఏ వేగంతో ప్రయాణించింది ఇలాంటివన్నీ పరిశీలించే అవకాశముంది. పెట్రోలింగ్ సిబ్బంది ప్రమాదంలో చిక్కుకుంటే వెంటనే సపోర్టింగ్ స్టాఫ్‌ను పంపడానికి వీలవుతుంది. ‘ప్యానిక్’ ఇంటర్ఫేస్ టెక్నాలజీతో యాక్టివేట్ చేయగానే కమాండ్ సెంటర్‌కు అలర్ట్ వెళ్తుంది. దీంతోపాటే లొకేషన్, టైమ్ కూడా చేరుతుంది.
‘డయల్ 112’కు అనుసంధానం
రాష్ట్రవ్యాప్తంగా 18 రకాల హెల్ప్ లైన్ నెంబర్లను ‘డయల్ 112’కు మారుస్తూ డీజీపీ ఇటీవలే ప్రకటన చేశారు. ఇకపై పెట్రోలింగ్ చేస్తున్న బైక్ పోలీసులు సైతం కొత్త టెక్నాలజీతో ఈ హెల్ప్ లైన్‌తో అనుసంధానమవుతారు. ఈ అనుసంధానంతో పెట్రోలింగ్ బైక్‌లకు ఉన్న జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్‌తో ఉన్నతాధికారుల నుంచి ఇన్ఫర్మేషన్ రాగానే సంఘటనా స్థలానికి వెళ్లడం, అవసరమైతే రెస్పాన్స్ టీమ్‌లను తెప్పించుకోవడం వీలవుతుంది.
పెట్రోలింగ్ బైక్‌ల లైవ్ లొకేషన్ అందుబాటులో ఉంటే ‘డయల్ 112’ మరింత ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని, నిమిషాల వ్యవధిలోనే స్థానికంగా ఉన్న పెట్రోలింగ్ స్టాఫ్‌ను పంపించవచ్చన్నది హోంశాఖ భావన. పెట్రోలింగ్ బైక్‌లు ఎక్కడున్నాయో తెలుసుకుని డ్యూటీని అసైన్ చేయడానికి బదులు ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా దగ్గర్లో ఉన్నవారిని పంపించడానికి వీలవుతుంది. పరోక్షంగా బైక్‌లకు అమర్చిన జీపీఎస్ ఎక్విప్మెంట్ ఒకరకంగా మొబిలిటీలో ఉన్న డేటా సెంటర్‌గా ఉంటుంది.

