కలం, నిర్మల్ : పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే సిలబస్‌పై స్పష్టమైన అవగాహనతో ప్రణాళికాబద్ధంగా సన్నద్ధం కావాలని ప్రముఖ పోటీ పరీక్షల నిపుణులు, విద్యావేత్త డాక్టర్ ప్రసన్న హరికృష్ణ అన్నారు. మాస్టర్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం ఆదిలాబాద్ (Adilabad) జిల్లా కేంద్రంలోని ఆర్ఎస్ గార్డెన్లో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు నిర్వహించిన ఉచిత అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా పోలీసు ఉద్యోగాలు సాధించేందుకు తీసుకోవాల్సిన శిక్షణ, చదువు ప్రణాళిక, సిలబస్ పై పట్టు, రివిజన్ విధానాలపై యువతకు అవగాహన కల్పించారు. పరీక్షల సన్నద్ధతపై అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగాలకు తీవ్ర పోటీ నెలకొన్నందున స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. శిక్షణ కాలం నుంచి పరీక్షలు పూర్తయ్యే వరకు మొబైల్, ఇంటర్నెట్, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని అన్నారు.
పరీక్షల్లో అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసేలా నిరంతరం సాధన చేయాలని సూచించారు. సమయాన్ని వృథా చేయకుండా సిలబస్ పై పట్టు సాధించడంతో పాటు తరచూ రివిజన్ చేసుకోవాలని తెలిపారు. ఎప్పటికప్పుడు మాక్ టెస్టులు రాసి మార్కులను విశ్లేషించుకోవడం ద్వారా వెనుకబడిన అంశాలను గుర్తించి మెరుగుపరుచుకోవచ్చన్నారు శిక్షణను సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫ్యాకల్టీ రమణ గౌడ్, పురుషోత్తం రెడ్డి, అల్లం సాయికృష్ణ, మాస్టర్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ రాష్ట్రపాల్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

