కలం, వెబ్ డెస్క్ : రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి (Medico Priyanka Death) పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) స్పందించారు. ప్రియాంక మరణంపై విచారణ వ్యక్తం చేసిన ఆయన.. ఆమె మరణం తనను తీవ్రంగా బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రియాంక మరణానికి కారణమైన వారిని ఇప్పటికే అరెస్ట్ చేసి.. జైల్లో ఉంచామని తెలిపారు. నిందితులపై కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం భరోసాగా నిలుస్తుందని చంద్రబాబు హామీనిచ్చారు.
రూ.20 లక్షల ఆర్థిక సాయం ప్రకటన
రాజమండ్రిలో కారు ప్రమాదానికి గురై మృతి చెందిన మెడికో ప్రియాంక కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలిచింది. బాధిత కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు.
కలెక్టర్, ఎస్పీతో సీఎం ఫోన్‌లో ఆరా
ప్రియాంక మృతి ఘటనపై సీఎం చంద్రబాబు సంబంధిత జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఘటనకు దారితీసిన పరిస్థితులు, ఇప్పటివరకు పోలీసులు చేపట్టిన చర్యలపై ఆరా తీశారు. ప్రియాంక మృతికి కారణమైన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టొద్దని సీఎం అధికారులను ఆదేశించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి, బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు స్పష్టం చేశారు.
కాగా, ఈ నెల 3వ తేదీన రాజమహేంద్రవరంలోని ఓ మాల్ లో ప్రియాంక తన స్నేహితుడితో సినిమా చూసి బయటికి వచ్చారు. ఈ క్రమంలో స్కూటీపై వెళ్తున్న వారిని వెనకనుంచి వచ్చిన కారు ఢీ కొట్టి వెళ్లి పోయింది. ఈ ఘటనలో ప్రియాంకకు తీవ్ర గాయాలు కాగా, అపస్మారక స్థితిలోకి వెళ్లింది. సమీపంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం ఆగస్ట్ 5న సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో తరలించారు. చికిత్స పొందుతున్న ప్రియాంక పరిస్థితి విషమించడంతో ఆదివారం మధ్యాహ్నం ప్రాణాలు కోల్పోయారు.

