కలం, కరీంనగర్ బ్యూరో: గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో 10 శాతం ప్రత్యేక నిధులు కేటాయించడంతో పాటు రిజర్వేషన్లను పూర్తి స్థాయిలో అమలు చేయాలనీ బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి (Jeevan Reddy).. సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. అంతర్జాతీయ ఆదివాసీ హక్కుల దినోత్సవం సందర్భంగా జీవన్ రెడ్డి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆదివారం లేఖ రాశారు. హైదరాబాద్ సంస్థానం నుంచి నేటి తెలంగాణ వరకు ఆదివాసీలు చేసిన త్యాగాలను ఆయన గుర్తు చేశారు. కొమురం భీం “జల్, జంగల్, జమీన్” నినాదంతో చేసిన పోరాట ఫలితంగానే తెలంగాణ ఏర్పడిందని తెలిపారు.
అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గిరిజన రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతనికి కు పెంచినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి మూడు కీలక చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివాసీలకు 10% రిజర్వేషన్ ను పూర్తిస్థాయిలో అమలు చేయాలన్నారు. బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేసి, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో జనాభా నిష్పత్తి ప్రకారం గిరిజనులకు అవకాశాలు కల్పించాలని జీవన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గిరిజన సంక్షేమానికి రాష్ట్ర బడ్జెట్లో ప్రత్యేకంగా 10 శాతం నిధులు కేటాయించి, ఖర్చు చేయాలని జీవన్ రెడ్డి (Jeevan Reddy) సూచించారు.
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని జగన్నాథ్‌పూర్, ద్యావన్పల్లి, తాట్లవాయి, వస్తాపూర్, కట్కాపూర్ గ్రామాల్లో, సారంగాపూర్, బీర్పూర్ రెవెన్యూ మండలాల్లోని రేచపల్లి, బీర్పూర్, తుంగూరు, కొల్వాయి, రంగసాగర్, కమ్మునూరు తదితర గ్రామాల్లో గిరిజనులు సాగు చేస్తున్న ప్రభుత్వ భూములకు భూ భారతి ద్వారా పట్టాలు ఇవ్వాలనిడిమాండ్ చేశారు. అలాగే రైతు భరోసా, బ్యాంకు రుణాల ద్వారా ఆర్థిక సహాయం అందించాలన్నారు.
అదేవిధంగా జగిత్యాల పట్టణంలో కొమురం భీం విగ్రహం ఏర్పాటు చేయాలని, ఆదివాసీ భవన్ నిర్మాణానికి 1 ఎకరం స్థలం కేటాయించి నిధులు ఇవ్వాలని జీవన్ రెడ్డి లేఖలో సీఎంను కోరారు. ఈ లేఖ కాపీలను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జగిత్యాల జిల్లా కలెక్టర్‌కు పంపినట్లు జీవన్ రెడ్డి పేర్కొన్నారు.

