కలం, నాగార్జునసాగర్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించే ప్రాంతాలలోనే పారిశుధ్య పనులు చేపడుతూ, మిగతా ప్రాంతాలను పట్టించుకోవడం లేదంటూ నందికొండ (Nandikonda) మున్సిపాలిటీ అధికారుల తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 10న నందికొండలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ‘వరుణ యాగం’ నిర్వహించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అయితే సీఎం పర్యటించే మార్గాలు, కార్యక్రమం జరిగే ప్రాంతాలలోనే మున్సిపల్ సిబ్బంది చెట్లు, ముళ్లకంపలను తొలగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
సత్యనారాయణ స్వామి ఆలయం నుంచి అయ్యప్ప స్వామి ఆలయం ఎదురుగా విజయ్ విహార్ వరకు రోడ్డుకు ఇరువైపులా చెట్లు, ముళ్లకంపలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు రోడ్డు పక్కన యథేచ్ఛగా పడేసిన వాటర్ పైపులు ప్రయాణికులకు ప్రమాదకరంగా మారాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో గతంలో పలుమార్లు ప్రమాదాలు జరిగినప్పటికీ మున్సిపల్ అధికారులు పట్టించుకోలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అయినా కేవలం ఆయన ప్రయాణించే మార్గాలకే పరిమితం కాకుండా నందికొండ (Nandikonda) మున్సిపాలిటీ పరిధిలోని అన్ని ప్రాంతాలలో పారిశుధ్య పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా పెరిగిన ముళ్లకంపలను తొలగించడంతో పాటు ప్రమాదకరంగా ఉన్న వాటర్ పైపులను వెంటనే పక్కకు తరలించి, వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని నందికొండ నివాసితులు కోరుతున్నారు.

