కలం, వెబ్ డెస్క్ : నార్త్ 24 పరగణాస్‌లోని హలీషహర్‌లో పర్యటిస్తున్న పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) వాహనంపై కొందరు దుండగులు దాడి చేశారు. పోలీస్ కస్టడీలో మరణించిన టీఎంసీ కార్యకర్త బిర్జూ కేఓట్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమీపంలో ఉన్న కొందరు ఆందోళనకారులు ఆమె కారును చుట్టుముట్టి రాళ్లు, ఇటుకలు, చెప్పులు, సీసాలు విసిరారు.
వాహనంపైకి బురద చల్లుతూ ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనగా, పోలీసులు జోక్యం చేసుకుని కాన్వాయ్‌ను సురక్షితంగా బయటకు పంపించారు. ఈ దాడిపై స్పందించిన మమతా బెనర్జీ, కొందరు గూండాలు ప్రణాళికాబద్ధంగా రాళ్లతో దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. తన వాహనం అద్దాలు మూసి ఉండటం వల్లే ప్రాణాపాయం తప్పిందని, ఒకవేళ గ్లాస్ తెరిచి ఉంటే తీవ్ర గాయాలై ప్రాణాలు కూడా పోయేవని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘోరమైన దాడిని తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని ఆమె పేర్కొన్నారు. ఈ ఘటన వెనుక బీజేపీ మద్దతుదారులు ఉన్నారని టీఎంసీ వర్గాలు భావిస్తున్నాయి.

