కలం, ఖమ్మం బ్యూరో : ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని టీవీ చూస్తున్న వృద్ధురాలిపై అల్లుడే యముడిలా విరుచుకుపడ్డాడు. తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తోందన్న కక్షతో ప్రియురాలితో కలిసి అత్తను చీర కొంగుతో పీక నొక్కి దారుణంగా హత్య చేశాడు. అంతటితో ఆగక ఆ మృతదేహాన్ని బైక్‌పై మధ్యలో కూర్చోబెట్టుకొని తీసుకెళ్లి పెట్రోల్ పోసి ఏకంగా మూడుసార్లు దహనం చేసేందుకు యత్నించాడు. సంచలనం సృష్టించిన తుంబూరు వృద్ధురాలి హత్య కేసును సత్తుపల్లి (Sathupalli Murder Case ) పోలీసులు ఆదివారం ఛేదించి, నిందితులైన అల్లుడు, అతని ప్రియురాలిని అరెస్ట్ చేశారు.
వైరా ఏసీపీ, కల్లూరు ఇన్‌చార్జ్ ఏసీపీ సారంగపాణి తెలిపిన వివరాల ప్రకారం… ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామానికి చెందిన వెదుళ్ల తిరుపతిరావు (55) తన రెండవ భార్య మంగమ్మతో కలసి ఉంటున్నాడు. అతనికి అదే గ్రామానికి చెందిన పగుట్ల సునీత (35) అనే మహిళతో అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసి తిరుపతిరావు భార్య మంగమ్మ, ఆమె తల్లి గుండాల వెంకట నర్సమ్మ (65)లు జూలై 30న సునీత పనిచేస్తున్న చోటుకు వెళ్లే నిలదీసి కొట్టారు. దీనిని తీవ్ర అవమానంగా భావించిన సునీత, తిరుపతిరావు కలిసి తమ బంధానికి అడ్డుగా ఉన్న అత్త వెంకట నర్సమ్మను మట్టుబెట్టాలని పథకం పన్నారు.
పథకంలో భాగంగా ఆగస్టు 2న రాత్రి 12 గంటల సమయంలో తిరుపతిరావు, సునీత కలిసి వెంకట నర్సమ్మ ఇంటికి వెళ్లారు. నర్సమ్మ కుర్చీలో కూర్చొని టీవీ చూస్తోంది. ఇద్దరూ లోపలికి ప్రవేశించి ఆమె చీర కొంగుతోనే మెడకు బిగించి ఊపిరిరాడకుండా చేసి చంపేశారు. హత్య అనంతరం తిరుపతిరావు తన బైక్ ఎక్కగా, వెంకట నర్సమ్మ మృతదేహాన్ని మధ్యలో కూర్చోబెట్టి, వెనుక సునీత కూర్చొని నారాయణపురం ఆంజనేయస్వామి గుడి దాటిన తర్వాత రోడ్డు ప్రక్కన ఉన్న చెత్తలోకి తీసుకెళ్లారు. బైక్ నుంచి తీసిన పెట్రోల్ పోసి తగులబెట్టారు. మరుసటి రోజు ఉదయం వెళ్లగా శవం పూర్తిగా కాలకపోవడంతో మళ్లీ ఎండు కట్టెలు, చెత్త వేసి వచ్చారు. ఆపై ఆగస్టు 3న రాత్రి 11 గంటలకు పెట్రోల్ బాటిళ్లతో వెళ్లి మిగిలిన శరీర భాగాలను వేరే చోటుకు తరలించి మూడోసారి పెట్రోల్ పోసి పూర్తిగా దహనం చేసే ప్రయత్నం చేశారు.
కాగా, తల్లి కనిపించడం లేదంటూ పెద్ద కూతురు మంగమ్మ ఆగస్టు 4న ఫిర్యాదు చేయడంతో సత్తుపల్లి సీఐ టి. శ్రీహరి ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. ఆదివారం ఉదయం నారాయణపురం-గురుభట్లగూడెం “ఎక్స్” రోడ్డు వద్ద నిందితులు తిరుపతిరావు, సునీతలను పోలీసులు అదుపులోకి తీసుకోగా, వారు చేసిన ఘోరాన్ని అంగీకరించారు. నిందితుల నుంచి బైక్, 2 ఫోన్లు, మృతురాలి పగిలిన ఫోన్, ఖాళీ పెట్రోల్ బాటిళ్లను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.

