కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక చైన్గేట్ సమీపంలోని కొమురం భీమ్, రాంజీ గోండు విగ్రహాలకు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి చౌహాన్ నిహారిక పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆగస్టు 9 ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీలు తమ హక్కులు, సంస్కృతి, సంప్రదాయాలను గుర్తుచేసుకునే పండుగ రోజని అన్నారు. ఆదివాసీల అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అనంతరం ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వాలు ఆదివాసీల సమస్యలను పూర్తిస్థాయిలో పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల అమలులో ఆదివాసీలకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని పేర్కొన్నారు. ఆదివాసీల హక్కులు, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడంతో పాటు వారికి సముచిత గుర్తింపు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

