కలం, వరంగల్ బ్యూరో: దేశంలో ప్రస్తుతం డ్రగ్స్ సమస్య ప్రధానంగా ఉందని డీజీపీ సీవీ ఆనంద్ (DGP CV Anand) అన్నారు. ఆదివారం హనుమకొండ ఎన్ఐటీ క్యాంపస్‌లో డీజీపీ పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
తన ట్రైనీ ఐపీఎస్ వరంగల్ నుంచే ప్రారంభమయ్యిందని గుర్తు చేసుకున్నారు. అయితే ఆ రోజుల్లో ఇంటి నుండి బయటకు వెళ్తే వస్తామా ? లేదా? అన్నంతగా నక్సల్స్ ప్రభావం ఉండేదని చెప్పారు. కానీ 2010 నుంచి మావోయిజం తగ్గిందని వెల్లడించారు. రాష్ట్రంలో మావోయిస్టుల ప్రముఖులతో పాటు క్యాడర్ లొంగిపోవడంతో ప్రస్తుతం మావోయిజం ప్రభావం ఇక లేదని వ్యాఖ్యానించారు.
ఈ క్రమంలోనే లొంగిపోయిన మావోలతో ములుగులో సోమవారం ఒక కార్యక్రమాన్ని చేపట్టామని వివరించారు. లొంగిపోయిన, మావో బాధితుల కోసం ఒక యాప్ తయారు చేశామని పేర్కొన్నారు. 1992-96 మధ్య చనిపోయిన వారికి ఎక్స్ గ్రేషియా కొంత తక్కువ వచ్చిందని తమ దృష్టికి వచ్చిందని, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
మావోయిస్టులు గంజాయికి వ్యతిరేమని.. వాళ్లు ఉన్నప్పుడు గంజాయి సరఫరాకు కొందరు భయపడేవారని తాను చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని సీవీ ఆనంద్ అన్నారు. మావోయిస్టులకు అనుకూలంగా మాట్లాడినట్లు చూపించారని ఆరోపించారు. అలాగే నక్సల్స్ సమస్యతో రాజకీయ నేతలకు సెక్యూరిటీ ఇచ్చామని, ఇప్పుడు అవసరంలేనందున కొందరికి సెక్యూరిటీ తగ్గించామని స్పష్టం చేశారు. అంతేగానీ భద్రత తగ్గింపు నిర్ణయాన్ని రాజకీయం చేయొద్దని సూచించారు.
ప్రస్తుతం డ్రగ్స్ తో పాటు సైబర్ నేరాలే ప్రధాన సమస్యలుగా మారాయని వెల్లడించారు. సైబర్ నేరాల్లో రూ. 1,750 కోట్లు పోగొట్టుకున్నారని.. సైబర్ నేరాల ఛేదనలో తెలంగాణ నెంబర్ వన్‌గా నిలిచిందని చెప్పుకొచ్చారు. విద్యాసంస్థల్లో డ్రగ్స్ వాడకంపై నిఘా పెంచామని తెలిపారు. నార్కొటిక్ బ్యూరో, ట్రాఫిక్, సీఐడీకి చెందిన వారితో కలసి ఒక బృందంగా ఏర్పడి జిల్లాల పర్యటనలు చేస్తున్నామని పేర్కొన్నారు.

