కలం, వెబ్ డెస్క్ : అంబర్పేట్ మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల వేడుకలు (Amberpet Bonalu) కన్నులపండువగా సాగుతున్నాయి. తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ వేదపండితులు ఆమెకు ఆశీర్వచనాలు అందించారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంబర్పేట్ మహంకాళి ఆలయానికి విచ్చేసి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి బోనాలు ప్రతీక అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. భక్తులతో కలిసి ఆయన వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాంతపూర్లోని నల్లపోచమ్మ ఆలయం భక్తుల జనసంద్రంగా మారింది. తెల్లవారుజాము నుంచే మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, నెత్తిన బోనాలు ఎత్తుకుని ఆలయానికి చేరుకున్నారు. డప్పుచప్పుళ్ల మధ్య పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పరిసర ప్రాంతాలన్నీ భక్తిపారవశ్యంతో మారుమోగాయి.

