కలం, వెబ్‌డెస్క్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej )లేటెస్ట్ మూవీ కొరియన్ కనకరాజ్ (Korean Kanakaraju) మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో వరుణ్‌తేజ్ తండ్రి మెగా బ్రదర్ నాగబాబు (Nagababu) ఎక్స్ వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. గత ఐదేళ్లుగా తన కుమారుడు ఎదుర్కొన్న అపజయాలు, పడిన కష్టాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఎలాంటి హిట్లు లేకపోయినా వరుణ్ తేజ్ ఎప్పుడూ ప్రయత్నం ఆపలేదని, అతడి పట్టుదల నేడు ‘కొరియన్ కనకరాజు’ సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుందని ఆనందం వ్యక్తం చేశారు.
ఈ విజయానికి వరుణ్ తేజే పూర్తి అర్హుడని, అతడి కష్టం, ఓర్పు వల్లే ఈ రోజు ఈ స్థాయికి చేరాడని నాగబాబు స్పష్టం చేశారు. తాను ఎప్పుడూ వరుణ్ కెరీర్లో జోక్యం చేసుకోలేదని, అతడి విజయాలైనా అపజయాలైనా పూర్తిగా అతడివేనని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు గాంధీ మెర్లపాక, సత్య, రితికా నాయక్, నిర్మాత రాజీవ్, సంగీత దర్శకుడు తమన్ సహా చిత్ర బృందమందరికీ ఆయన హృదయపూర్వక అభినందనలు, ఆశీస్సులు తెలిపారు. ఆయన థియేటర్లో సినిమా చూస్తున్న వీడియోను ఈ పోస్టుకు జత చేశారు.

