కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : నాడు ప్రయోగశాలల నుంచి పంట పొలాలకు అనే లక్ష్యంగా ఆవిర్భవించిన కృషి విజ్ఞాన కేంద్రాలు (Krishi Vigyan Kendras).. నేడు వ్యవసాయ శాస్త్రవేత్తల కొరతతో సతమతమవుతున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం 16 కృషి విజ్ఞాన కేంద్రాలు(కేవీకే) పని చేస్తున్నాయి. ఇవి భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) పరిధిలో ఉండగా.. వీటిలో ఎక్కువ భాగం ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో, మరికొన్ని కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం, స్వచ్ఛంద సంస్థల(ఎన్జీవో) నిర్వహణలో ఉన్నాయి. ఆయా కేంద్రాలు ప్రధానంగా ‘లాబ్ టు ల్యాండ్’ (ప్రయోగశాల నుంచి పొలం వరకు) అనే ఉద్దేశంగా పని చేస్తుండగా.. వీటి పనితీరు రైతుల స్థాయిలో చాలా కీలకంగా ఉంది. కొత్త వంగడాలు, సాగు పద్ధతులను క్షేత్ర స్థాయి ప్రదర్శనల ద్వారా పరిచయం చేస్తున్నాయి. రైతులకు, గ్రామీణ యువతకు వ్యవసాయం, ఉద్యానవన పంటలు, పశుపోషణపై శిక్షణ ఇస్తున్నాయి. నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేసి రైతులకు అందుబాటులో ఉంచడంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇటీవలి నివేదికల ప్రకారం వీటి పనితీరు రైతులకు ఉపయోగకరంగా ఉన్నప్పటికీ, సిబ్బంది కొరత సమస్య వేధిస్తోంది.
ఒక్కో కేంద్రంలో ఏడుగురు
ఒక్కో కృషి విజ్ఞాన కేంద్రానికి ఏడుగురు వ్యవసాయ శాస్త్రవేత్తలు ఉండాలి. వీరిలో ఒక ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, ఆరుగురు సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్టులు చొప్పున 7 పోస్టులు మంజూరు చేయబడి ఉంటాయి. ఇందులో సస్యరక్షణ, అగ్రానమి, విస్తరణ, గృహవిజ్ఞానం, పశుసంవర్ధక , హార్టికల్చర్ విభాగాలకు ఒక్కొక్క శాస్త్రవేత్త ఉంటారు. మొత్తం మంజూరైన తెలంగాణలోని 16 కేంద్రాలకు సుమారు 112 మంది శాస్త్రవేత్తలు ఉండాలి. చాలా కేంద్రాల్లో పూర్తి స్థాయిలో సిబ్బంది లేరు. కొన్ని కేంద్రాల్లో ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పోస్టులు, మరికొన్నింటిలో సబ్జెక్ట్ స్పెషలిస్ట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం సుమారు 50 మంది శాస్త్రవేత్తలు మాత్రమే ఉన్నట్లు అంచనా.
నిర్వీర్యం చేస్తున్నారనే ఆరోపణలు
కృషి విజ్ఞాన కేంద్రాలు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ వాటా 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వ వాటా 40 శాతంగా నడుస్తున్నాయి. ఇందులోని శాస్త్రవేత్తలకు కేంద్ర ప్రభుత్వమే జీతభత్యాలు భరిస్తుంది. కేంద్ర ప్రభుత్వం జీతభత్యాలు భరిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం శాస్త్రవేత్తలను రిక్రూట్ చేయడంలో జాప్యం చేయడంతో కృషి విజ్ఞాన కేంద్రాలు ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నాయి. వీటిని నిర్వీర్యం చేసేందుకే కొందరు వ్యవహరిస్తున్నారని అభ్యుదయ రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆలోచించి తగిన జాగ్రత్తలు తీసుకొని కృషి విజ్ఞాన కేంద్రాల పనితీరును మెరుగుపరచడానికి కృషి చేయాలని పలువురు రైతులు కోరుతున్నారు.

