కలం, ఖమ్మం బ్యూరో : ఇంటి ముందు భద్రంగా పార్క్ చేసిన స్కూటీని ఇద్దరు దొంగలు అత్యంత సులువుగా ఎత్తుకెళ్లిన ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి (Sattupalli) పట్టణంలో కలకలం రేపింది. ఈ చోరీకి సంబంధించిన దృశ్యాలన్నీ సమీపంలోని సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి.
స్థానిక తుంబూరు రామారావు వీధికి చెందిన టైలర్ షాప్ యజమాని సత్యనారాయణ శుక్రవారం రాత్రి తన స్కూటీని ఇంటి ముందు పార్కింగ్ చేశారు. అర్ధరాత్రి సమయంలో అక్కడికి వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆ స్కూటీని అపహరించుకుపోయారు. శనివారం ఉదయం లేచి చూసేసరికి వాహనం కనిపించకపోవడంతో బాధితుడు సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా దొంగలు స్కూటీని తీసుకెళ్తున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు వేగవంతం చేశారు.

