కలం, వెబ్ డెస్క్: నంద్యాల (Nandyal) జిల్లా కొత్తపల్లి మండలకేంద్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం (Kothapalli KGBV) లో బుధవారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న బోయ భవ్య అనే విద్యార్థిని హాస్టల్ బాత్రూమ్‌లో ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
వివరాల్లోకి వెళితే.. లింగాపురం గ్రామానికి చెందిన భవ్య బుధవారం తెల్లవారుజామున హాస్టల్ బాత్రూమ్‌లో అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని తోటి విద్యార్థినులు గమనించారు. వెంటనే వారు కేజీబీవీ సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది వెంటనే స్పందించి బాలికను ముందుగా కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో, వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం ఆత్మకూరు ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. కాగా, అప్పటికే భవ్య మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
సమాచారం అందుకున్న ఆత్మకూరు రూరల్ సీఐ సురేశ్ కుమార్ రెడ్డి, ఎస్ఐ నారాయణ రెడ్డి సంఘటనా స్థలానికి, ఆసుపత్రికి చేరుకుని పరిశీలించారు. మృతదేహం లభించిన ప్రాంతంలో ఉన్న సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే అదే హాస్టల్‌లో ఉంటున్న ఇద్దరు బాలికల మధ్య చోటుచేసుకున్న వ్యక్తిగత పరిణామాలే ఈ ఘటనకు కారణమై ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.
Also Read : ఆసియా క్రీడల్లో మీరాబాయి చానుకు రజతం
Follow Us On: X(Twitter)

