కలం, స్పోర్ట్స్: థాయ్‌లాండ్‌లోని (Thailand) మహిడోల్ యూనివర్సిటీ వేదికగా జరిగిన ఆసియా జూనియర్ పిక్కెల్‌బాల్ ఛాంపియన్‌షిప్ 2026 (Asia Pickleball Junior Open 2026) లో భారత యువ క్రీడాకారులు అద్భుత ప్రదర్శన కనబరిచారు. వివిధ విభాగాలలో భారత ప్లేయర్లు ఒక స్వర్ణం, ఒక వెండి, ఒక కాంస్య పతకంతో మొత్తం మూడు పతకాలు సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచారు.
మూడు విభాగాలలో పతకాల పంట
అండర్-18 బాలికల డబుల్స్ విభాగంలో శృతి, అంజలి జోడీ అద్భుత ఆటతీరుతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అదే అండర్-18 బాలికల సింగిల్స్‌లో అంజలి పోల్ రజత పతకం సాధించింది. అండర్-12 బాలికల డబుల్స్ విభాగంలో ఆద్య, కీర్తి జోడీ పోరాటపటిమతో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. దీంతో భారత యువ క్రీడాకారులు మూడు వేర్వేరు విభాగాలలో పతకాలు సాధించారు.
భారత పిక్కెల్‌బాల్‌కు శుభసూచకం
భారత యువ ప్లేయర్ల ప్రదర్శనపై అరవింద్ ప్రభు హర్షం వ్యక్తం చేశారు. వివిధ వయసు, విభాగాలలో పతకాలు సాధించడం భారత పిక్కెల్‌బాల్ భవిష్యత్తుకు శుభసూచకమని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనడం యువ క్రీడాకారులకు విలువైన అనుభవాన్ని అందిస్తుందని, ఇలాంటి వేదికలు వారి ప్రతిభను మరింత మెరుగుపరచడానికి దోహదపడతాయని తెలిపారు. ఆసియా జూనియర్ పిక్కెల్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో(Asia Pickleball Junior Open 2026) సాధించిన ఈ మూడు పతకాలు అంతర్జాతీయ స్థాయిలో భారత యువ క్రీడాకారుల ప్రయాణానికి మరింత ప్రోత్సాహాన్ని అందించనున్నాయి.

