కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లాలోని ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉన్న నీటిని భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని శాస్త్రీయంగా, ప్రణాళికాబద్ధంగా వినియోగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Nirmal Collector Bhavesh Mishra) తెలిపారు. శనివారం సాయంత్రం నిర్మల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రాజెక్టుల నీటిమట్టం, సాగునీటి లభ్యత, పంటల సాగు, పంట మార్పిడి విధానాలపై ఇరిగేషన్ అడ్వైజరీ సమావేశం నిర్వహించారు.
అనంతరం కలెక్టర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ఇప్పటివరకు అవసరమైన మేర వర్షపాతం నమోదైనప్పటికీ, కొన్ని మండలాల్లో సుమారు 20 శాతం వర్షపాతం లోటు ఉందన్నారు. రానున్న రోజుల్లో ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున ముందస్తు కార్యాచరణతో సాగునీటి నిర్వహణ చేపడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని భవిష్యత్తు అవసరాలు, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పొదుపుగా వినియోగిస్తామని చెప్పారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా జిల్లాలో సుమారు 35 వేల ఎకరాలకు, కడెం ప్రాజెక్టు ద్వారా 6 వేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందని వెల్లడించారు. గ్రామసభల ద్వారా నీటి లభ్యత, భవిష్యత్తు పరిస్థితులను రైతులకు వివరిస్తూ అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఇంకా స్వల్పకాలిక పంటలు సాగు చేసుకునేందుకు అవకాశం ఉన్నందున రైతులు కంది వంటి ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా వ్యవసాయ శాఖ అధికారులు ప్రోత్సహిస్తున్నారని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, నీటిపారుదల శాఖ ఎస్ఈ రాజేంద్ర ప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్, హార్టికల్చర్ అధికారి రమణ తదితరులు పాల్గొన్నారు.

