కలం, మెదక్ బ్యూరో : వేలాది పరిశ్రమలు, లక్షలాది మంది కార్మికులు పనిచేసే ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతమైన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో కార్మికులకు అన్ని రకాల వైద్యసేవలను అందించడానికి సిఎస్ఆర్ (CSR) నిధులతో మల్టీ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం కోసం 16-07-2022న ఉత్తర్వులు ఇచ్చింది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో పటాన్‌చెరులో 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ (Patancheru Hospital)కు రూ.184 కోట్లు మంజూరు చేశారు. ఇందులో 45 కోట్లు ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి మంజూరు చేయగా, 25 కోట్లు ఆస్పత్రిలో అవసరమయ్యే వివిధ రకాల వైద్య పరికరాలకు కేటాయించారు.
అయితే తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TGMSIDC) వైద్య పరికరాలు కొనుగోలు చేయాల్సి ఉన్నా, ఇప్పటి వరకు కూడా పూర్తిస్థాయిలో పరికరాలు రా లేదు. సుమారు 114 కోట్లు వచ్చే 10 ఏండ్లకు ఆసుపత్రి నిర్వహణ ఖర్చు కోసం కేటాయించారు. పటాన్‌చెరు మల్టీ స్పెషాలిటీ నిర్మాణానికి సంబంధించిన పనులు ప్రారంభమై దాదాపు 4 ఏళ్లు గడిచింది. పటాన్‌చెరు (Patancheru Hospital) బస్టాండ్ దగ్గర ముంబాయి నేషనల్ హైవేను ఆనుకొని నూతన భవన నిర్మాణం పూర్తయి ఏడాది గడుస్తుంది. 200 పడకల ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ భవనాల నిర్మాణాన్ని ఇంజనీరింగ్ విభాగం పూర్తి చేసి.. హెల్త్ డిపార్ట్‌మెంట్‌కు ఆరు నెలల క్రితం అప్పగించింది.
కొత్తగా అందుబాటులోకి వచ్చే పటాన్‌చెరు హాస్పిటల్‌కు డాక్టర్లు 58 మంది అవసరం ఉండగా 48 మంది మంజూరు అయ్యారు. ఇంకా 10 మంది డాక్టర్లను నియమించాల్సి ఉంది. హాస్పిటల్ పూర్తి స్థాయి నిర్వహణ కోసం మొత్తం 179 మంది ఇతర వైద్య సిబ్బంది అవసరం ఉండగా, కేవలం 58 మంది మాత్రమే సాంక్షన్ అయ్యారు. ఇంకా 121 మంది నియామకం ఎప్పటివరకు జరగలేదు.
ఆధునిక వైద్యసేవలకు దూరమవుతున్న ప్రజలు
సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 4732 పరిశ్రమలు ఉన్నాయి. మినీ ఇండియాగా పేరు పొందిన పటాన్‌చెరు నియోజకవర్గంలో బల్క్ డ్రగ్, ఫార్మా, ఇంజనీరింగ్‌తో పాటు వివిధ రకాల పరిశ్రమలు ఉంటాయి. పటాన్‌చెరు ప్రాంతంలోని పరిశ్రమల్లో లక్షలాది మంది కార్మికులు పనిచేస్తుంటారు. ఇక్కడ పారిశ్రామికవాడల్లో దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు వచ్చి ఉపాధి పొందుతుంటారు. దీంతో పరిశ్రమల నుండి వచ్చే కాలుష్యంతో పాటు ప్రమాదాల కారణంగా ప్రతియేట వేలాది మంది అనారోగ్యం బారిన పడుతుంటారు.
పొల్యూషన్ ద్వారా వచ్చే వ్యాధులను నయం చేయడం కోసం పటాన్‌చెరు హాస్పిటల్‌ను ప్రత్యేకంగా మంజూరు చేశారు. నాలుగు ఏళ్ల క్రితం మంజూరైన పటాన్‌చెరు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో ఈ ప్రాంత ప్రజలు వైద్యం కోసం సంగారెడ్డి లేదా నిమ్స్, ఉస్మానియా, గాంధీ హాస్పిటళ్లకు వెళ్తున్నారు. అత్యవసర వైద్యం కోసం ప్రైవేట్ హాస్పిటల్స్‌నే అనివార్యంగా ఆశ్రయిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం పూర్తయినా వైద్యశాఖ అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలు నాణ్యమైన వైద్యం కోసం హైదరాబాద్ లేదా ప్రైవేట్ హాస్పిటల్స్‌కు వెళ్లాల్సి వస్తుంది.
పరిశ్రమల్లో ప్రమాదాలు, ముంబాయి హైవే పైన ప్రమాదాల కారణంగా గాయపడిన వారు సకాలంలో వైద్యం అందకపోవడంతో ప్రాణాలను పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. పటాన్‌చెరు ప్రాంతంలో పేద ప్రజలకు ప్రభుత్వ వైద్యం అందని ద్రాక్షలాగా మారింది. పటాన్‌చెరులో మల్టీ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం పూర్తయినా ప్రారంభానికి నోచుకోకపోవడంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది.
వెంటనే వైద్యసేవలను అందుబాటులోకి తేవాలి
సంగారెడ్డి జిల్లాకు చెందిన దామోదర రాజనర్సింహ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ.. పటాన్‌చెరులో 200 పడకల ప్రభుత్వ హాస్పిటల్ ప్రారంభం కాకపోవడం బాధాకరమని ప్రజలు అంటున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో.. వైద్యం అందకపోవడంతో పేద ప్రజలు బలి అవుతున్నారని.. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లు ఆసుపత్రి నిర్మాణం పూర్తయినా ఇంకా ప్రారంభం కాకపోవడానికి కారణమేంటని వైద్య అధికారులను ప్రశ్నిస్తున్నారు. అధికారుల వ్యవహారశైలి చూస్తే ప్రైవేట్ హాస్పిటల్స్‌తో కుమ్మక్కై ఈ ప్రభుత్వ దవాఖానను ప్రారంభించడం లేదనే అనుమానాలను ప్రజలు ఆరోపిస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యానికి పేద ప్రజలు వైద్యానికి దూరమవుతున్నారు. ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి పటాన్‌చెరులో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని ఇప్పటికే పలు పార్టీలు కార్యక్రమాలను నిర్వహించాయి. ఏ ప్రభుత్వాలైనా పేద ప్రజల సంక్షేమం కోసమే పనిచేయాలని, సాక్షాత్తూ ఆరోగ్య శాఖ మంత్రి సొంత జిల్లాలో పేదలకు ప్రభుత్వ వైద్యం అందించే విషయంలో నిర్లక్ష్యం వహించడం సరికాదని అంటున్నారు.
ఈ నెల 15న సీఎం రేవంత్ రెడ్డి సంగారెడ్డి జిల్లా పర్యటన ఉన్న సందర్భంలో పటాన్‌చెరులో పూర్తయిన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రారంభింపజేయాలని కోరుతున్నారు. వైద్య అధికారులు, ప్రజాప్రతినిధులు పేదల ఆరోగ్యం విషయంలో అలసత్వంగా ఉండవద్దని.. హాస్పిటల్‌ను ప్రారంభించి పటాన్‌చెరు ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందాలని కోరుతున్నారు.
Also Read : తెలంగాణ సర్కార్ నిర్ణయాలు.. ఉన్నతాధికారులకు నిందలు!
Follow Us On: Instagram

