శ్రీలంక సిరీస్‌కు సాయి సుదర్శన్‌ దూరం!

కలం, స్పోర్ట్స్: శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ముందే భారత క్రికెట్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. గాల్ వేదికగా ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్న రెండు టెస్టుల సిరీస్‌కు స్టార్ బ్యాటర్ సాయి సుదర్శన్ (Sai Sudharsan) దాదాపు దూరమైనట్లు తెలుస్తోంది. పాదంలో గాయం కారణంగా ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ (CoE)లో అతడు రీహాబిలిటేషన్ తీసుకుంటున్నాడు. తొలి టెస్టు సమయానికి సాయి సుదర్శన్ కోలుకుంటాడని టీమ్ మేనేజ్‌మెంట్ ఆశించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితులలో వైద్యుల నుంచి క్లియరెన్స్ రావడం కష్టంగా మారినట్లు సమాచారం. దీంతో అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు సెలక్టర్లు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు.

రేసులో షేక్ రషీద్, సర్ఫరాజ్ ఖాన్

సాయి సుదర్శన్ స్థానంలో షేక్ రషీద్, సర్ఫరాజ్ ఖాన్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. సర్ఫరాజ్ ఇప్పటికే ఫిట్‌నెస్ పరీక్షల కోసం వారం రోజులుగా బెంగళూరులోని CoEలోనే ఉన్నాడు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువ బ్యాటర్ షేక్ రషీద్‌ను కూడా ఆదివారం బెంగళూరులో రిపోర్ట్ చేయాల్సిందిగా టీమ్ మేనేజ్‌మెంట్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇటీవల శ్రీలంకలో జరిగిన ఇండియా-ఏ సిరీస్‌లో రషీద్ 45, 63, 20 పరుగులతో ఆకట్టుకున్నాడు. దీంతో అతడు ఇప్పటికే సెలక్టర్ల పరిశీలనలో ఉన్నాడు. రానున్న వారాలలో CoEలో నిర్వహించనున్న స్పెషలిస్ట్ బ్యాటర్ల క్యాంప్‌కు కూడా రషీద్ ఎంపికయ్యాడు. ఈ క్యాంప్‌లో ఆర్. స్మరణ్, అమన్ మోఖాడే కూడా పాల్గొననున్నారు.

స్పెషలిస్ట్ బ్యాటర్ల కొరత

టీమిండియాలో స్పెషలిస్ట్ బ్యాటర్‌ల  కొరత తీవ్రంగా ఉందన్న విషయాన్ని టీమ్ మేనేజ్‌మెంట్ ఇప్పటికే సెలక్టర్ల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఇండియా-ఏ జట్టులో దేవదత్ పడిక్కల్, సాయి సుదర్శన్ (Sai Sudharsan), ధ్రువ్ జురెల్ మాత్రమే ఆడటంతో ఇతర స్పెషలిస్ట్ బ్యాటర్లను పెద్దగా పరిశీలించే అవకాశం సెలక్టర్లకు లేకుండా పోయింది. ఇక సర్ఫరాజ్ ఖాన్‌ను తిరిగి సెలక్షన్ రేసులోకి తీసుకురావాలంటే దేశవాళీ క్రికెట్‌లో పైవరుసలో బ్యాటింగ్ చేయాలని కొందరు ముఖ్యులు సూచించినట్లు తెలుస్తోంది.

రషీద్‌కే ఎక్కువ అవకాశాలు?

సర్ఫరాజ్ ఖాన్ స్పిన్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోగల బ్యాటర్. అంతర్జాతీయ క్రికెట్ అనుభవం కూడా అతడికి ఉంది. ఫిట్‌నెస్‌పై కూడా అతడు ప్రత్యేకంగా దృష్టి పెట్టాడు. అయితే 21 ఏళ్ల షేక్ రషీద్‌పై CoE కోచ్‌ల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ సానుకూలంగా ఉండటంతో అతడికే తొలి ప్రాధాన్యం లభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు రుతురాజ్ గైక్వాడ్ పేరు కూడా సెలక్టర్ల పరిశీలనలో ఉన్నప్పటికీ, ఇండియా-ఏ తరఫున అతడి ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడంతో వైల్డ్‌కార్డ్ ఎంపికగానే మిగిలే అవకాశముంది. సాయి సుదర్శన్ స్థానంలో ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై భారత క్రికెట్ బోర్డు త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

Also Read : అదొక డేటింగ్ ట్రాప్.. అమ్మాయిలకు సజ్జనార్ హెచ్చరిక

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>