వరి పంటపై మంత్రి కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్

కలం, నల్లగొండ: ఎల్ నినో ప్రభావం కారణంగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు (Nagarjuna Sagar Project) లో నీటిమట్టం డెడ్ స్టోరేజ్‌కు చేరిందని, ఉన్న నీరు కేవలం తాగునీటికే సరిపోతుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) స్పష్టం చేశారు. పైనుంచి నీరు వచ్చే అవకాశం లేకపోవడంతో, రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ వరి వేయకుండా ఆరుతడి పంటల వైపు మళ్లేలా అధికారులు, ప్రజాప్రతినిధులు విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు.

శనివారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. శ్రీశైలం నుంచి నీరు వచ్చినప్పటికీ పంటలకు సాగునీరు ఇచ్చే పరిస్థితి లేదని, ప్రస్తుతం ఉన్న నీరు జూన్ 2027 వరకు తాగునీటి అవసరాలకే సరిపోతుందని మంత్రి తెలిపారు. రాబోయే రోజుల్లో సూపర్‌ ఎల్‌ నినో ముప్పు ఉన్నందున దక్షిణ తెలంగాణలో పరిస్థితులు తీవ్రంగా ఉండే ప్రమాదముందన్నారు.

జిల్లాలో ఇప్పటికే భూగర్భ జలాలు పడిపోతున్నాయని, బోర్లలో నీళ్లు తగ్గుతున్న ఈ కష్టకాలంలో అధికారులంతా రైతులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. పంట మార్పిడిలో భాగంగా జిల్లాలో ఇప్పటికే 33 వేల ఎకరాల్లో వరికి బదులు ఆరుతడి పంటలు వేశారని, దీన్ని లక్షన్నర ఎకరాల లక్ష్యంగా ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. నిరంతరం వరి సాగు చేయడం, విపరీతంగా ఎరువులు వాడటం వల్ల భవిష్యత్తులో భూములు సారం కోల్పోతాయని హెచ్చరించారు.

కూరగాయలు, ఉద్యాన పంటలు, సేంద్రియ (ఆర్గానిక్) వ్యవసాయంపై రైతులకు చైతన్యం తేవాలన్నారు. అధికారులు కోరిన విధంగా జిల్లాకు 5 వేల యూనిట్ల స్ప్రింక్లర్లను తక్షణమే మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. కరువు పరిస్థితులు వచ్చినా నల్గొండ జిల్లాకు శాశ్వతంగా సాగునీరు అందించే ఎస్ఎల్బీసీ సొరంగం పనులను ఆగస్టు 2028 నాటికి పూర్తి చేస్తామని మంత్రి ప్రకటించారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ పనులకు ఎంత ఖర్చైనా వెనకాడబోమని, శ్రీశైలం డెడ్ స్టోరేజ్‌లో ఉన్నా ఎస్ఎల్బీసీ ద్వారా నీటిని అందించవచ్చని తెలిపారు. దీనిద్వారా ఏఎమ్‌ఆర్పీ, ఎస్ఎల్బీసీ, బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టుల కింద జిల్లాలో 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. అలాగే, జిల్లాలోని 9 వేల ట్రాన్స్‌ఫార్మర్లపై ఉన్న ఓవర్‌లోడ్‌ సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రితో మాట్లాడి అవసరమైన విద్యుత్ సామగ్రిని తెప్పిస్తామని హామీ ఇచ్చారు. ఇకపై జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశాలను నిరంతరం నిర్వహించాలని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్, నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, నీటిపారుదల శాఖ సీఈ శ్రీనివాస్ రెడ్డి, వివిధ మార్కెట్ కమిటీల చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>