రైతుల పంటలు ఎండనివ్వం.. మేఘారెడ్డి కీలక హామీ

కలం, వనపర్తి: రైతులకు సాగునీరు అందడం లేదని, కృష్ణాలో వరదలు వస్తున్నా ప్రభుత్వం నీటిని వినియోగించుకోవడం లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి (Singireddy Niranjan Reddy) చేసిన ఆరోపణలలో వాస్తవం లేదని వనపర్తి ఎమ్మెల్యే (Wanaparthy MLA) తూడి మేఘారెడ్డి (Tudi Megha Reddy) అన్నారు. నీటిపారుదల వ్యవస్థలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న విషయాలను తెలుసుకోకుండా రాజకీయ విమర్శలు చేయడం సరికాదని అన్నారు.

ఆగస్టు 1 నుంచే లిఫ్ట్‌-1 ప్రారంభం

ఎంజీకేఎల్‌ఐ లిఫ్ట్‌-1 పంపుల ద్వారా ఆగస్టు 1 నుంచే నీటి ఎత్తిపోతలు ప్రారంభించామని ఎమ్మెల్యే (Wanaparthy MLA) తెలిపారు. ఇప్పటివరకు శ్రీశైలం నుంచి 2.7 టీఎంసీల నీటిని ఎత్తిపోశామని చెప్పారు. ఎల్లూరు రిజర్వాయర్‌ సామర్థ్యం 0.355 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 0.34 టీఎంసీల నీరు ఉందని అన్నారు. సింగోటం రిజర్వాయర్‌ సామర్థ్యం 0.55 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 0.40 టీఎంసీల నీరు ఉన్నట్లు వివరించారు.

లిఫ్ట్‌-2 ద్వారా కొనసాగుతున్న నీటి ఎత్తిపోతలు

ఆగస్టు 1 నుంచే లిఫ్ట్‌-2 ద్వారా కూడా నీటి ఎత్తిపోతలు ప్రారంభించామని మేఘారెడ్డి తెలిపారు. జొన్నలబొగడ రిజర్వాయర్‌ (Jonnalaboguda Reservoir) సామర్థ్యం 2.14 టీఎంసీలు కాగా, ఆగస్టు 7 నాటికి నీటిమట్టం 404.80 మీటర్లకు చేరిందని అన్నారు. ప్రస్తుతం 1.753 టీఎంసీల నీటి నిల్వ ఉందని చెప్పారు. మూడు పంపుల ద్వారా 2,400 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 2,100 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతోందని అన్నారు. మూడు పంపులు పనిచేస్తూ నీటిని ఎత్తిపోస్తున్న విషయం దీనివల్ల స్పష్టమవుతోందని తెలిపారు.

కాలువలకు 2,100 క్యూసెక్కుల నీటి విడుదల

29వ ప్యాకేజీ కల్వకుర్తి ఎడమ కాలువ ద్వారా ఆగస్టు 8న 2,100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు. ఆగస్టు 6 నుంచే లిఫ్ట్‌-3 కూడా ప్రారంభమైందని అన్నారు. గుడిపల్లిగట్టు రిజర్వాయర్‌ సామర్థ్యం 0.62 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 0.42 టీఎంసీల నీరు ఉందని తెలిపారు.

అన్ని కాలువలకు సాగునీరు

ఆగస్టు 7న అన్ని కాలువలకు సాగునీటిని విడుదల చేశామని మేఘారెడ్డి చెప్పారు. ఆగస్టు 8 ఉదయం గుడిపల్లి రిజర్వాయర్‌ వద్ద గేట్లు ఎత్తి కాలువలకు నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. ఇన్ని వాస్తవాలు కళ్లముందు ఉన్నప్పటికీ మోటర్లు ఆన్‌ చేయలేదని, రైతులకు సాగునీరు అందించడం లేదని ఆరోపించడం సరికాదని అన్నారు.

రైతుల సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యం

రైతుల కోసం పనిచేసేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని మేఘారెడ్డి అన్నారు. ప్రచారం కోసం కాకుండా రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తోంది. రైతులకు అవసరమైన సమయంలో సాగునీరు అందించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని చెప్పారు. పంపులు ఎప్పుడు ప్రారంభించామో తేదీలతో సహా చెబుతున్నామని, ఎంత నీటిని ఎత్తిపోశామో, రిజర్వాయర్లలో ఎంత నీరు నిల్వ ఉందో, కాలువలకు ఎప్పుడు నీటిని విడుదల చేశామో లెక్కలతో వెల్లడిస్తున్నామని తెలిపారు.

జాతీయ ప్రాజెక్టు నుంచి నీటిని తీసుకోవాలంటే సంబంధిత అనుమతులు అవసరమనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రైతులకు అన్ని విధాలా అండగా నిలిచేందుకు కృషి చేస్తున్నారని మేఘారెడ్డి తెలిపారు. రైతులు సాగుచేసిన పంటలను ఒక్క ఎకరం కూడా ఎండనివ్వకుండా చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. రాజకీయ విమర్శలు చేసే ముందు వాస్తవాలను తెలుసుకోవాలని, ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు కూడా నీటిపారుదల పరిస్థితులను పరిశీలించాలని ఎమ్మెల్యే సూచించారు.

Also Read : క్షుద్రపూజల వివాదం.. రేవంత్‌ కి కేటీఆర్ కౌంటర్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>